KTRs Delhi Tour: బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసిందా? కేటీఆర్ ఢిల్లీ యాత్ర అందుకేనా!
Telangana News | తనపై అవినీతి ఆరోపణలు వస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి ఖట్టర్ కు ఫిర్యాదుతో కౌంటర్ ఎటాక్ చేశారు.
Is BRS started a counter attack | హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, ఆ తర్వాత పార్టీలోని కొందరు కీలక నేతలు కారు దిగి హస్తం బాట పట్టడంతో పార్టీలో కొంత నీరసం ఆవహించింది. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెల్చుకోకపోవడం కూడా గులాబీ పార్టీకి రాజకీయంగా బాగా దెబ్బ పడిందనే చెప్పాలి. ఆ తర్వాత కొద్ది పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పార్టీ మారడంతో కారు పార్టీలో నిస్తేజం కనిపించింది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాజకీయ మౌనం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేశాయి.
ఓవైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ అనుకున్న రీతిలో గత ఆరేడు నెలలుగా రాజకీయాలు చేయలేకపోయిందనే చెప్పాలి. అయితే గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావులు ఇద్దరూ అధికార కాంగ్రెస్ నిప్పులు చెరుగుతున్నారు. అంశాలవారీగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల చేరిక విషయంలో న్యాయస్థానంలో సవాల్ విసిరారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వరదలు, రైతుల రుణ మాఫీ, హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన, ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికలపూడి గాంధీ సవాళ్ల వంటి అంశాలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆరు గ్యాంరటీ అమలుపైన వాగ్భాణాలు సంధిస్తున్నారు. దీంతో పార్టీలో ఉన్న నిరాశ దూరమయి కార్యకర్తలు సైతం ఉత్సాహంగా వ్యహరిస్తున్నారు.
కేటీఆర్ ఢిల్లీ యాత్ర మర్మం ఇదేనా...?
ఫార్మూలా ఈ రేస్ (Formula E Race) వ్యవహారంలో విదేశీ కంపెనీకి అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రూ.55 కోట్లు నిబంధనలకు విరుద్దంగా ఇచ్చారని, ఈ కేసులో ఏసీబీ అరెస్టు చేస్తోందని కాంగ్రెస్ మంత్రులు గత కొద్ది రోజులుగా చెబుతున్నారు. అరెస్టుపై గవర్నర్ అనుమతి తీసుకున్నారని త్వరలోనే కేటీఆర్ అరెస్టు అవడం ఖాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్ ఢిల్లీ యాత్ర అందరినీ ఆకర్షించింది. అరెస్టు నుండి తప్పించుకోవడానికి మోదీ ప్రభుత్వ సాయం కోసమే ఢిల్లీ వెళ్లారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఎలా వచ్చిందో కూడా తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పడం గమనార్హం.
ఇలా తెలంగాణలో రాజకీయ వాతావరణం వెడెక్కిన సమయంలో కేటీఆర్ ఢిల్లీలో కాలుపెట్టడం మరింత సంచలనానికి దారి తీసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లు బీజేపీ నేతలతో మంతనాలు జరిపేందుకేనా అన్న ఊహాగానాలు చెలరేగాయి. ఢిల్లీలో బీజేపీకి కాంగ్రెస్ శత్రువు, తెలంగాణలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు శత్రువు. కాబట్టి అటు బీజేపీ- బీఆర్ఎస్ లు తమ ఉమ్మడి శత్రువును కలిసి ఎదుర్కొంటున్నాయన్న చర్చ సాగింది. అయితే కేటీఆర్ ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ వ్యవహారం నడపడం గమనార్హం.
ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పై కేటీఆర్ దూకుడు మంత్రం
తెలంగాణలో తనపై ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ఢిల్లీ వేదికగా షాక్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కార్ రెస్ వ్యవహారంలో తనపై ఆరోపణలు వస్తున్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమృత్ పథకంలో స్కాంకు తెరలేపారని ఆరోపించారు. అమృత్ పథకంలో పనులకు గాను 8888 కోట్ల టెండర్లను పిలిచిన రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డి కంపెనీ కట్టబెట్టారని కేంద్ర పురపాలక శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయనకు అందజేశారు. పార్లమెంట్ సమావేశాల్లోగా రేవంత్ సర్కార్ పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా రెవెన్యూ మంత్రి పొంగులేటికి సంబంధించిన స్కాంలను బయటపెడతానని హెచ్చరించారు.
ఇవన్నీ చూస్తుంటే తనను, పార్టీని కౌంటర్ చేస్తున్నందును తిరిగి కేటీఆర్ కౌంటర్ ఎటాక్ దిగిరాని తెలుస్తోంది. తనపై అవినీతి ఆరోపణలను కాంగ్రెస్ మంత్రులు చేస్తోంటో, కేటీఆర్ ఏకంగా అమృత్ స్కాంలో సీఎం రేవంత్ రెడ్డి పేరును లాగడం రాజకీయంగా బీఅర్ఎస్ దూకుడును తెలియజేస్తోంది. గత కొద్ది రోజులుగా స్తబ్ధుగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ లోను ఈ పరిణామాలు ఉత్సాహాన్ని నింపాయనడంలో సందేహం లేదు.
రెండు రాష్ట్రాల ఎన్నికల సమయంలో కేటీఆర్ ఢిల్లీ యాత్రకు కారణం ఇదేనా..
మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన పథకాలపైన మాట్లాడి అక్కడి ఓటర్లను ప్రభావింత చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ సర్కార్ ను, రేవంత్ తీరును గట్టిగా విమర్శిస్తూ మాట్లాడటం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాది కాకముందే అమృత్ పథకంలో స్కాంకు తెరలేపారని చెప్పే ప్రయత్నం చేయడం, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు, ఏకంగా రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మా కంపెనీకి తన స్వంత అల్లుడి కోసం భూములు కట్టబెడుతున్నారని అందులో భాగంగా అక్కడి ప్రజలు తిరగబడ్డారని ఢిల్లీ పర్యటనలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇవన్నీ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రచారంకు కౌంటర్ గా మాట్లాడారా అన్న కోణంలోను ఆలోచించాల్సి ఉంది.
అటు బీజేపీకి- ఇటు బీఆర్ఎస్ కు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. ఈ నేపధ్యంలో కేటీఆర్ కామెంట్స్ ఎంతో కొంత బీజేపీకి లాభం చేకూర్చే అంశం అనే చెప్పాలి. అయితే ఇది ఆ రెండు పార్టీల వ్యూహంలో భాగమా.. లేక తనపైఆరోపణలు చేసినందుకు కేటీఆర్ కౌంటర్ ఎటాకా అన్నది మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో బీజేపీ- బీఆర్ఎస్ వ్యవహర శైలిని బట్టి రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ కు తెలంగాణలో చెక్ పెట్టనున్నాయా అన్నది తెలియనుంది. ప్రస్తుతం కేటీఆర్ ఢిల్లీ యాత్ర మాత్రం రాజకీయ వ ర్గాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసిందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.
Also Read: Janwada Farm House Case: జన్వాడ ఫాం హౌస్ కేసులో కీలక పరిణామం, విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ