TRS Plenary : టీఆర్ఎస్‌లో అసలు "వర్క్" అంతా కేటీఆర్‌దే ! ప్లీనరీ సక్సెస్‌తో మరోసారి పట్టు నిరూపించుకున్న యువనేత !
టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణలో అంతా తానై కేటీఆర్ మరోసారి తన నాయకత్వ లక్షణాల్ని ప్రదర్శించారు. అధ్యక్షుడు కేసీఆరే అయినా .. అన్ని పనులు చక్కబెట్టే అసలైన అధ్యక్షుడిగా పార్టీ శ్రేణుల కితాబులందుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవ కార్యక్రమం "ప్లీనరీ" మొత్తం యువనేత కేటీఆర్ చుట్టూనే తిరిగింది. అధ్యక్షుడిగా కేసీఆర్ తొమ్మిదో సారి ఏకగ్రీవంగా ఎన్నికయినప్పటికీ అసలు కార్యాచరణ మొత్తం కేటీఆర్‌దేనని ప్లీనరీ మరోసారి నిరూపించినట్లయింది. ప్లీనరీకి సంబంధించిన ప్రతి చిన్న విషయంతో పాటు పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయి. దీంతో హాజరైన నేతలందరూ కేసీఆర్‌తో పాటు కేటీఆర్ దృష్టిలో పడేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేశారు.
Also Read : తెలంగాణలో సమాచార హక్కు చట్టం నిర్వీర్యం.. వివాదాస్పద ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ !
ప్లీనరీ నిర్వహణలో కేటీఆర్ మార్క్ !
హైదరాబాద్ హైటెక్స్‌లో గులాబీ సంబురం రోజంతా ఉరిమే ఉత్సాహంతో సాగింది. మొత్తం కేటీఆర్ హవానే కనిపించింది. నిజానికి అధ్యక్షునిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నందున ఫ్లెక్సీలు, కటౌట్‌లు అన్నీ ఎక్కువగా కేసీఆర్‌వే పెట్టారు.కేటీఆర్‌కు పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. కానీ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ప్రకారం.. మొత్తం వ్యవహారాలు తానే చూసుకున్నారు. కేసీఆర్ కూడా మొత్తం ప్లీనరీ నిర్వహణ బాధ్యతలు కేటీఆర్కే ఇచ్చారు. అన్నీ సంతృప్తిగా సాగిపోయాయి.
కేటీఆర్ మీదే పూర్తి స్థాయి బాధ్యతలు పెట్టిన కేసీఆర్ !
కేటీఆర్ పార్ట్టీలోని యూత్ టీంతో కలిసి ప్లీనరీని సక్సెస్ చేశారు. ఏ చిన్న లోటు లేకుండా సాఫీగా సాగిపోయేలా చూశారు. సహజంగానే కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా అత్యంత ముఖ్యమైన విషయాలకు మాత్రమే స్పందిస్తూ ఉంటారు. మిగతా పనులన్నీ కేటీఆరే చేస్తున్నారు. వివాదాలు వచ్చినా.. సభలు, సమావేశాలు నిర్వహించాల్సి వచ్చినా కేటీఆరే పని పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు ప్లీనరీ నిర్వహణతో పార్టీపై కేసీఆర్ స్థాయిలో తనకు ఉన్న పట్టును మరోసారి కేటీఆర్ నిరూపించుకున్నారన్న భావన వినిపిస్తోంది.
పరిమితంగానే ప్రతినిధులకు ఆహ్వానం
ప్రజాప్రతినిధులందరినీ పిలిచి ప్లీనరీ నిర్వహిద్దమనుకున్నారు కానీ.. చివరికి నియోజకవర్గానికి యాభై మంది చొప్పున ఆరు వేల మందికే ఆహ్వానించాలని నిర్ణయించారు. కానీ ఆ యాభై మందిని కూడా పిలువలేదని.. నియోజకవర్గానికి పాతిక మంది వరకే ఆహ్వానాలు వెళ్లాయని తెలుస్తోంది. దీంతో ప్లీనరీ వద్ద ఉండాల్సిన స్థాయిలో కోలాహలం కనిపించలేదు. కానీ పెద్ద ఎత్తున ఇతరులు తరలి వచ్చారు. వారికి లోపలికి వెళ్లడానికి పాస్‌లు లభించకపోవడంతో బయటే ఉండిపోవాల్సి వచ్చింది.
Also Read: ప్లీనరీ నుంచే కేసీఆర్ హుజురాబాద్ ప్రచారం ! ఎన్నికల సంఘంపై ఆగ్రహం వెనుక అసలు కారణం..