Huzurabad KCR : ప్లీనరీ నుంచే కేసీఆర్ హుజురాబాద్ ప్రచారం ! ఎన్నికల సంఘంపై ఆగ్రహం వెనుక అసలు కారణం..
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుజురాబాద్ ఓటర్లకు ప్లీనరీ నుంచే సందేశం ఇచ్చారు. ఈసీ ప్రచారం చేయనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుజురాబాద్‌లో కేసీఆర్ ప్రచారానికి వెళ్లడం లేదు. ఈ విషయంపై ప్లీనరీ వేదికగా కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. బహిరంగసభ విషయంలో ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని కేసీఆర్ తీవ్రంగా తప్పు పట్టారు. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుందన్నారు. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి... గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నారు. కేసీఆర్ సభ పెట్టొద్దని చెప్పడం ఏమిటన్నారు. దళిత బంధు పథకం నిలిపివేయాలనడం ఏ మాత్రం గౌరవం కాదన్నారు. ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోవాలని ఈసీని హెచ్చరిస్తున్నానని ప్రకటించారు.
Also Read : ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !
కేసీఆర్ ఆగ్రహానికి ప్రధాన కారణం బహిరంగసభ విషయంలో ఈసీ జారీ చేసిన కొత్త నిబంధనల కన్నా .. దళిత బంధు పథకాన్ని ఎన్నికలయ్యే వరకూ నిలిపివేయాలన్న ఆదేశాలే కారణం అని అనుకోవచ్చు. వ్యూహాత్మకంగా ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే దళిత బంధును కేసీఆర్ ప్రారంభించారు. కొత్త పథకాలను మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నిలిపివేయాలి. పాత పథకాలను కొనసాగించవచ్చు. అయితే పోలింగ్‌కు పది రోజుల ముందు వరకూ సైలెంట్‌గా ఉన్న ఈసీ.. హఠాత్తుగా దళిత బంధు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో సహజంగానే గగ్గోలు రేగింది. ఆపేసింది మీరంటే మీరని టీఆర్ఎస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి.
ప్రజల్లో అసంతృప్తి రాకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సభా వేదికగా హజురాబాద్ ఓటర్లకు అభయం కూడా ఇచ్చారు. ఈసీ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దళితబంధు అమలు జరిగి తీరుతోందని భరోసా ఇచ్చారు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలుస్తారని ఆయన ఆధ్వర్యంలోనే దళిత బంధు అమలవుతుందని చెబుతున్నారు ఈసీ సభ పెట్టకుండా ఆపింది కాబట్టి ..తాను ప్లీనరీ నుంచే హుజురాబాద్ ప్రజలకు చెబుతున్నానని. నవంబర్ 4 నుంచి హుజురాబాద్‌లో దళిత బంధు అమలు చేస్తాం. ఈసీ వచ్చే నెల 4వ తేదీ వరకే ఆపగలదని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నవంబర్, డిసెంబర్ నెలల్లోగా అర్హులైనా అందరికీ ‘దళితబంధు’ ఇస్తామని హామీ ఇచ్చారు.
Also Read : టీఆర్ఎస్ @ 20 ...చింతమడక నుంచి ప్రజల మనసుల్లోకి కేసీఆర్ !
పక్క నియోజకవర్గాల్లోనూ బహిరంగసభలు పెట్టవద్దన్న ఈసీ ఆదేశాలకు కేసీఆర్ ప్రచారం హుజురాబాద్‌లో ఉండదని తేలిపోయింది. రెండు రోజుల పాటు రోడ్ షో ప్లాన్ చేస్తున్నరన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ప్లీనరీ వేదికగా కేసీఆర్ చేసిన ప్రకటనను బట్టి.. హుజురాబాద్ ఓటర్లకు సందేశం ఇచ్చేశారు కాబట్టి ఇక ఆయన ప్రచారం లేనట్లేనని భావిస్తున్నారు.
Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?