Disha Case : ఎన్‌కౌంటర్ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !
దిశ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపుతున్న కమిషన్ తమను ఇప్పుడే ప్రశ్నించవద్దని ఇద్దరు పోలీసు అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. సాక్షులను ప్రశ్నించిన తర్వాతనే తమను విచారించాలని వారు కోరుతున్నారు.
తెలంగాణ పోలీసులకు దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటన ఆందోళన కలిగిస్తున్నట్లుగా ఉంది. ఆ ఎన్‌కౌంటర్‌పై నిజానిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణ వేగంగా సాగుతోంది. అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సహా ఆ ఎన్‌కౌంటర్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన వారందర్నీ కమిషన్ ప్రశ్నిస్తోంది. అయితే ఈ కమిషన్ విచారణ తీరుపై ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు హైకోర్టులో పిటిషన్ వేయడం ఆసక్తికరంగా మారింది.
దిశ కేసులో జస్టిస్ సిర్ఫూర్కర్ కమిషన్ ముందుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌ను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ విచారణ అధికారి ఏసీపీ సురేందర్, మరో అధికారి నర్సింహారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అధికారులను ముందుగా విచారణ చేయడం నిబంధనలకు విరుద్దమని ఈ అధికారులు ఇద్దరూ తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అధికారుల తరపున సీనియర్ కౌన్సెల్ వివేక్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. ముందుగా సాక్ష్యులను విచారించాలని.. ఆ తర్వాతే విచారణ అధికారులను ప్రశ్నించాలని వివేక్ రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అయితే జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ మాత్రం సాక్షుల కంటే ముందే విచారణ అధికారులు అయిన పిటిషనర్లను ప్రశ్నించాలని అనుకుంటోందని .. ఆ విచారణపై స్టే ఇవ్వాలి కోరారు. సాక్షులను విచారించిన తర్వాత విచారణ అధికారులను పిలిచేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న తర్వాత విన్న హైకోర్టు తీర్పు రీజర్వ్ చేసింది.
Also Read: బిడ్డ తన పోలికలతో పుట్టలేదని చంపేసిన తండ్రి.. అనంతరం మరో ఘోరం
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ చురుగ్గా విచారణ చేపడుతోంది. ఈ విచారణలో అధికారులపై సూటిగా ప్రశ్నలు సంధిస్తోంది. ఎన్ కౌంటర్ విషయంలో ఉన్న అనుమానాలు, ఆరోపణలు, ప్రచారాలు అన్నింటినీ ప్రస్తావిస్తూ.. పోలీసులు అబద్దాలు చెబుతున్నారన్న దాన్ని ఎక్స్‌పోజ్ చేస్తోందని జాతీయ మీడియాలోనూ కథనలు వచ్చాయి. ఈ క్రమంలో సజ్జనార్ విచారణ జరిగిన తీరు.. శంషాబాద్ డీసీపీ కూడా పొంతన లేని సమాధానాలు చెప్పారని మీడియాలో వచ్చిన తరుణంలో ఇద్దరు పోలీసు అధికారులు తమ విచారణ ఇప్పుడే వద్దంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం ఆశ్చర్యకరంగా మారింది.
Also Read : మాజీ ఎమ్మెల్యే కొడుకు ఐఏఎస్.. కానీ ఆయన చేసిన పనే కేస్ అయింది !
2019లో ఎన్‌కౌంటర్ జరిగినప్పుడే సుప్రీంకోర్టు జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ కోవిడ్ కారణంగా కమిషన్ వచ్చి విచారణ జరపలేకపోయింది. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడంతో కమిషన్ విచారమ ప్రారంభించారు. మరో వారంలో విచారణ పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి