Bhadradri Kothagudem: వ్యాపారి సూసైడ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు పేరు... మరి వివాదంపై వనమా రియాక్షన్ ఏంటి?
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడిపై తొలి నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తాజాగా మరో వివాదం ఆయన్ను చుట్టుముట్టింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన వడ్డీ వ్యాపారి మల్లిపెద్ది వెంకటేశ్వరరావు ఆత్మహత్య చేసుకోవడం, ఆయన రాసిన సూసైడ్ నోట్‌లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు పేరును ప్రస్తావించడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ఓ ఇంటి స్థలానికి సంబందించి తనపై కొందరు వ్యాపారులు, అధికారులతో కలిసి వేధింపులకు పాల్పడ్డాడని, తనపై దాడికి పాల్పడటంతో మానసికంగా ఇబ్బందికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నానని మల్లిపెద్ది వెంకటేశ్వరరావు తన సూసైడ్ నోట్‌లో రాశారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసిన వనమా వెంకటేశ్వరరావు తనయుడిపై గత 20 ఏళ్ల నుంచి అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా రెండు సార్లు ఓటమి పాలైనప్పటికీ 2018 ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు, వనమా వెంకటేశ్వరరావుపై ఉన్న సానుభూతి కారణంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
వనమా వెంకటేశ్వరరావుపై నియోజకవర్గంలో మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ ఆయన తనయుడిపై అప్పట్నుంచి కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ భయాందోళనలు ఉన్నట్లు తెలుస్తోంది. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అప్పట్నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరుకే ఉనప్పటికీ పెత్తనం మొత్తం రాఘవ చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.
ఆది నుంచి ఆరోపణలే..
వనమా రాఘవేంద్రరావుపై తొలి నుంచి ఆరోపణలు ఉంటూనే ఉన్నాయి. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడతారని విపక్షనేతలు ఆరోపిస్తుంటారు. గతంలో చిట్టయ్య అనే కార్మికుడి మృతి, నవ భారత నవభారత్‌కు చెందిన ఓ గిరిజన మహిళపై భూ వివాదం, దళితుల భూమి వివాదాలతో పాటు మున్సిపల్ నిధుల వ్యవహారంలో కూడా వనమా రాఘవ హస్తం ఉన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
‘ఏబీపీ దేశం’తో వనమా రాఘవేంద్రరావు స్పందన ఇదీ..
మరోవైపు పాల్వంచకు చెందిన వ్యాపారవేత్త మల్లిపెద్ది వెంకటేశ్వరరావు రాసిన సూసైడ్ నోట్‌లో వనమా రాఘవేంద్రరావు పేరు ప్రస్తావించిన విషయంపై ‘ఏబీపీ దేశం’ రాఘవేంద్రరావును ఫోన్ ద్వారా వివరణ కోరింది. దీనిపై స్పందించిన ఆయన వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తన ఎదుగుదల గిట్టని కొంత మంది తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు. అసలు తనకు వెంకటేశ్వరరావుకు మధ్య ఎలాంటి సంబంధం లేదని, ఒకవేళ పోలీసుల విచారణలో ఆయన ఆత్మహత్య ఘటనకు తనకు సంబంధం ఉందని తేలితే మొత్తం వనమా కుటుంబం రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటుందని తేల్చి చెప్పారు. అసలు సూసైడ్ నోట్‌లో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దాదాపు 40 మంది వరకూ వ్యక్తుల పేర్లు రాశారని, ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసిందేనని వనమా రాఘవేంద్రరావు కొట్టిపారేశారు.