(Source: ECI/ABP News/ABP Majha)
Khammam Suda: అభివద్ధి చెందుతున్నా.. కదలని సుడా మాస్టర్ ‘ప్లాన్’.. మోక్షమోప్పుడో!
ఖమ్మం మున్సిపాలిటీ నుండి నగర పాలక సంస్థగా మారి ఏళ్లు గడుస్తున్నా కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో తీవ్ర జాప్యం జరిగింది.
అభివద్ధి చెందుతున్న ఖమ్మం నగరంకు మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో నిర్మాణాలు, అభివద్ధి కార్యక్రమాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖమ్మం మున్సిపాలిటీ నుండి నగర పాలక సంస్థగా మారి ఏళ్లు గడుస్తున్నా కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో తీవ్ర జాప్యం జరిగింది. మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో నగరంలో ఇష్టానుసారంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ 2008 నాటి డ్రాఫ్ట్ ప్లాన్‌తోనే నిర్మాణాలను చేపడుతున్నారు. మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన ఖమ్మంకు ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో ప్రస్తుతం జరిగే నిర్మాణాలు భవిష్యత్తులో అడ్డంకిగా మారనున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం 2017, అక్టోబర్ 24న ప్రభుత్వం ఖమ్మం నగర పాలక సంస్థతోపాటు చుట్టుపక్కల 7 మండలాల పరిధిలోని 46 గ్రామ పంచాయతీలను కలుపుకుని స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా)ను ఏర్పాటు చేసింది. దీంతో సుడాకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా సుడా పరిధిలో మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ప్రభుత్వం స్టెమ్ అనే సాంకేతిక సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఈ సంస్థ ఆధునిక సాంకేతిక జీపీఎస్ విధానంతో మాస్టర్ ప్లాన్‌ను తయారి చేస్తుంది. ఇప్పటికే ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను సంస్థ రూపొందించింది. సుడా మాస్టర్ ప్లాన్‌ను రాబోయే 20 సంవత్సరాల వరకు పెరిగే జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను తయారు చేస్తున్నట్లు తెలిసింది.
సుడా మాస్టర్ ప్లాన్..
స్థంభాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) పరిధిలోని ఖమ్మం కార్పోరేషన్ తో పాటు, వైరా, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, చింతకాని, కొణిజర్ల, రఘునాథపాలెం మండలాల్లోని 46 గ్రామ పంచాయతీలకు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివద్ధి, పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన ప్లాన్‌ను సిద్ధం చేశారు. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రీయల్, రిక్రియేషన్, పబ్లిక్, సెమిపబ్లిక్ జోన్‌ల వివరాలను, రోడ్లు, వాటి వెడల్పుల వివరాలు, చెరువులు, కాలువలు, వాగుల వివరాలు మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచేందుకు ముసాయిదా ప్లాన్‌ను తయారు చేశారు.
సుడాకు తయారు చేస్తున్న మాస్టర్ ప్లాన్ పరిధి వైశాల్యం 536 చదరపు కిలోమీటర్లుగా ఉండనుంది. ప్రస్తుతం ఖమ్మం నగర పాలక సంస్థ ఉపయోగిస్తున్న మాస్టర్ ప్లాన్ 33 చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి మాత్రమే తయారు చేశారు. ఈ మాస్టర్ ప్లాన్‌లో కొన్ని రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ జోన్లు, రోడ్ల వివరాలు సక్రమంగా లేవనే ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటిని పరిష్కరించేలా కొత్త మాస్టర్ ప్లాన్‌ను తయారు చేస్తున్నారు.
వాయిదాలతోనే..
సుడాకు మాస్టర్ ప్లాన్ తయారి నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతుంది. సుడా ఏర్పడక ముందు మాస్టర్ ప్లాన్ తెరపైకి రాగా కొన్ని కారణాలతో వాయిదా పడింది. సుడా ఏర్పడిన తర్వాత ప్లాన్‌ను రూపొందించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ వరుస ఎన్నికలు, ఇతర కారణాలతో దీనికి అడుగులు పడలేదు. 2020 ఏడాదిలో ప్లాన్ తయారిలో కదలికలు వచ్చినప్పటికీ అభ్యంతరాలతో ఆగిపోయింది. తాజాగా గత నెల మొదటి వారంలో సుడా అధికారులు ముసాయిదా ప్లాన్‌పై సమీక్షించేందుకు నిర్ణయించినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో నిలిచిపోయింది. గత నెల 10న సమీక్షా సమావేశం నిర్వహించేందుకు సుడా నిర్ణయించినప్పటికీ వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఎన్నికల కోడ్ ముగియడంతో ఇప్పటికైనా తిరిగి ముసాయిదాపై చర్చించి, త్వరగా ప్లాన్‌ను తీసుకోస్తే బాగుంటుందని నగర వాసులు కోరుకుంటున్నారు. మాస్టర్ ప్లాన్ వస్తే నగరంలో నిర్మాణాలు మరింత వేగవంతంగా చేపట్టవచ్చని భావిస్తున్నారు.
ఇష్టానుసారంగా నిర్మాణాలు..
ప్రస్తుతం సుడా పరిధిలో ఎటువంటి మాస్టర్‌ప్లాన్ అమలు కాకపోవడంతో నిర్మాణాలు ఇష్టానుసారంగా సాగుతున్నాయి. 2008 డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను అనుసరించి నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అయితే మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్లయితే ఇందుకు అనుగుణంగా నిర్మాణాలు లేకపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో వాణిజ్య, వ్యాపార సముదాయాలను రెసిడెన్షియల్ ప్రాంతాల్లో నిర్మిస్తుండటంతో ఇబ్బంది కరంగా మారనుంది. ఇక కమర్షియల్ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ భవనాలను నిర్మిస్తున్నారు. నగరంలోని రోడ్లు విస్తరించకుండానే నిర్మాణాలు చేపడుతుండటంతో అవి యజమానులకు, నగర పాలక సంస్థ అధికార యంత్రాంగానికి కొత్త ఇబ్బందులను తెచ్చి పెట్టనున్నాయి. మాస్టర్‌ప్లాన్ ఇంకా ఆలస్యమైతే మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందనే వాదనలున్నాయి.
Also Read: మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..
Also Read: Anandayya Medicine: ఆనందయ్య ఒమిక్రాన్ మందుకు ఎదురుదెబ్బలు, ప్రభుత్వం నుంచే.. పంపిణీ సాగేనా?
Also Read: New Study: కోపం, అసహనం పెరిగిపోతోందా? మీరు తినే ఆహారం కూడా వాటికి కారణమే