Khammam: భూముల ధరల పెరుగుదలతో ఖమ్మం రిజిస్ట్రేషన్ శాఖకు రూ.26 కోట్ల ఆదాయం
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కొత్త కళ వచ్చింది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న లావాదేవీలు పూర్తయ్యాయి.

భూముల ధరలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రిజిస్ట్రేషన్ శాఖకు కలిసొచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెరగనుండటంతో స్టాంప్ డ్యూటీ పెరుగుతుందని అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌లను పూర్తి చేసుకునేందుకు వినియోగదారులు క్యూకట్టారు. దీంతో సుమారు వారం రోజులపాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద వినియోగదారుల సందడి నెలకొంది. ఖమ్మం రిజిస్ట్రేషన్ శాఖకు ఏకంగా రూ.26 కోట్ల ఆదాయం లబించడం గమనార్హం.
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువలను అధికారికంగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ ధరలను 25 శాతం నుంచి 50 శాతం వరకు పెంచింది. ఎకరం వ్యవసాయ భూమికి ప్రస్తుతం అమలులో ఉన్న ధరపై 50 శాతం అదనంగా భూ విలువ పెరిగాయి.
ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలంలో ఎకరం వ్యవసాయ భూమి విలువ రూ.1,50,000 ఉంది. కొత్త ధర ప్రకారం అక్కడ రూ.2,25,000లు పలకనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో ఎకరం భూమి రూ.1,25,84,000లు ఉండగా.. కొత్త ధర రూ.1,88,76,000లు కానుంది. భూ విలువలు పెరిగితే రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫిబ్రవరి 1 నుంచి అమలు కావడంతో అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌లను పూర్తి చేసుకునేందుకు వినియోగదారులు రిజిస్టార్ కార్యాలయాలకు క్యూ కట్టారు. ఫిబ్రవరి 1 నుంచి భూ విలువలు పెరగడం, దీంతోపాటు స్టాంప్ డ్యూటీ కూడా పెరగనుండటంతో భారీగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరిగింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖకు జనవరి నెలలో గణనీయంగా ఆదాయం పెరిగింది.
ఖమ్మంలో రూ.26 కోట్ల ఆదాయం..
ఖమ్మం రిజిస్ట్రార్ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖకు పెరిగిన భూముల వల్ల ఆదాయం గణనీయంగా పెరిగింది. కొత్తగా పెరిగిన భూ ధరల ఆధారంగా పిబ్రవరి 1 నుంచి స్టాంప్ డ్యూటీతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజులు సైతం పెరగనున్న నేపథ్యంలో పాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు వినియోగదారులు సిద్దమయ్యారు. పెరిగిన ధరలను అనుసరించి 50 శాతం మేరకు స్టాంప్ డ్యూటీలు పెరగనున్నాయని వెంటనే పెండింగ్ ప్రక్రియలను పూర్తి చేసుకున్నారు. దీంతో ఖమ్మం పరిసర ప్రాంతాలలో ఉన్న ఖమ్మం, ఖమ్మం రూరల్, కూసుమంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఖమ్మం ప్రధాన కార్యాలయంలో 1793 రిజిస్ట్రేషన్లు జరగ్గా, కూసుమంచి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 964, ఖమ్మం రూరల్ కార్యాలయంలో 684 రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో కేవలం స్టాంప్ డ్యూటీ ద్వారానే రిజిస్ట్రేషన్ శాఖకు రూ.19.98 కోట్ల ఆదాయం రాగా ట్రాన్స్‌ఫర్ డ్యూటీ ద్వారా రూ.2.79 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు ద్వారా 3,68 కోట్ల ఆదాయం వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అత్యధికంగా జరుగుతున్న ఖమ్మం పరిసర ప్రాంతాల నుంచే ఈ ఆదాయం లబించింది. మొత్తంగా పెరిగిన భూముల ధరలతో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌లను పూర్తి చేసుకునేందుకు వినియోగదారులు క్యూ కట్టడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కళకళలాడాయి.





















