Khairatabad Ganesh : బై బై గణేశా, గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపయ్య
Khairatabad Ganesh : ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం పూర్తి అయింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల సేవలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు.
Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహా గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఎంతో ఘనంగా జరిగిన బడా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ముగిసింది. భక్తుల కోలాహాలం మధ్య ఎంతో శోభాయమానంగా శోభాయాత్ర జరిగింది. ఖైరతాబాద్ పంచముఖ మహా గణపయ్య తొమ్మిది రోజుల పాటు భక్తుల విశేష పూజలు అందుకుని ఇవాళ నిమజ్జనానికి తరలివచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నం. 4 వద్ద బడా గణేశ్ నిమజ్జనం పూర్తి అయింది. భారీ గణపతికి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలివచ్చారు.
50 అడుగుల భారీ విగ్రహం
పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహా గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. భక్తుల కోలాహాలం మధ్య ఎంతో ఘనంగా శోభాయాత్రగా హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చిన గణపతి నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ మార్గ్ వద్ద నాలుగో నంబర్ క్రేన్ వద్ద బడా గణేశ్ ను నిమజ్జనం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభమైన ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర సుమారు 9 గంటల పాటు సాగింది. భక్తుల కోలాహాలం మధ్య 50 అడుగుల భారీ గణపయ్య విగ్రహాన్ని 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో 26 టైర్ల టస్కర్ వాహనంలో నిమజ్జనానికి తరలించారు. ట్యాంక్ బండ్‌కు చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతికి ఉత్సవ సమితి సభ్యులు తుది పూజలు చేసి వీడ్కోలు పలికారు.
Khairtabad Ganesh passing through Telephone Bhavan #Hyderabad #KhairatabadGanesh pic.twitter.com/EECAEk3YfB
— Siddharth KumarSingh (@siddharthk63) September 9, 2022
మహా లక్ష్మీ గణపతి విశేషాలు
శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణపయ్య...2014లో 60 అడుగులకు చేరుకున్నాక షష్టి పూర్తి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత ఒక్కో అడుగు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుత పంచముఖ గణపయ్య విగ్రహం 50 అడుగులు. ఈ ప్రతిమను పూర్తిగా మట్టితో రూపొందించారు. పంచముఖ లక్ష్మీగణపతిగా దర్శనమిచ్చిన స్వామివారికి కుడివైపున మయూర వాహనంపై కుమారస్వామి, ఎడమ వైపు గాయత్రీదేవి కొలువుతీరారు. సుప్రీం కోర్టు ఆదేశాలు, తెలంగాణ ప్రభుత్వ సూచనలతో 68 ఏళ్లలో తొలిసారిగా గణపతి విగ్రహాన్ని పూర్తిగా మట్టితో తయారుచేశారు. జూన్ 10 నుంచి విగ్రహ నిర్మాణపనులు ప్రారభించారు. 150 మంది కళాకారులు అహర్నిశలు పనిచేయడంతో తుదిరూపు వచ్చేందుకు 80 రోజులు పట్టింది. విగ్రహ తయారీకి 35 టన్నుల మట్టిని వినియోగించారు. మహాగణపతిని పాదాలకు సమీపం నుంచి నమస్కరించే అవకాశం లేకపోవడంతో ప్రత్యేకంగా పాదాలకు నమస్కరించే విధంగా పాదముద్రికలు అందుబాటులో ఉంచారు. ఇందుకోసం కోటిన్నర రూపాయలు ఖర్చు అయిందని నిర్వాహకులు తెలిపారు. గతంలో లడ్డు కోసం తొక్కిసలాట జరగడంతో ఈసారి బొమ్మ లడ్డూ మాత్రమే గణపతి వద్ద ఉంచారు. శుక్రవారం సాయంత్రం హుస్సేన్ సాగర్‌లో విగ్రహ నిమజ్జనం పూర్తయింది. స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 55 అడుగుల యజ్ఞోపవీతం, 50 అడుగుల కండువా విగ్రహానికి అలంకరించారు.
Also Read : Balapur Ganesh Laddu : రూ. 450 నుంచి మొదలై రూ. 24 లక్షల వరకు- భళా అనిపిస్తున్న బాలాపూర్ లడ్డు
Also Read : Balapur Ganesh Laddu: బాలాపూర్ లడ్డూ రికార్డులు బ్రేక్, వేలంలో రూ.24.60 లక్షలు పలికిన ధర