KCR : నిరుద్యోగుల్లో అంచనాలు పెంచేసిన కేసీఆర్ ! "సంచలన ప్రకటన" అసంతృప్తిని చల్లార్చుతుందా ? పెంచుతుందా ?
వనపర్తిలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన "టీజర్" వైరల్ అవుతోంది. నిరుద్యోగుల్లో అంచనాలు పెంచేస్తోంది. ఇంతకూ కేసీఆర్ చేయబోతే ప్రకటన నిరుద్యోగుల అంచనాలను అందుకుంటుందా ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం అసెంబ్లీలో సంచలన ప్రకటన చేస్తానని ప్రకటించారు. అయితే ఇది రాజకీయ ప్రకటన కాదు. ఎందుకంటే నిరుద్యోగులను ప్రత్యేకంగా టీవీలు చూడాలని ఆయన కోరారు. అసెంబ్లీ సమావేశాలు చూడాలన్నారు. అంటే ఆయన నిరుద్యోగులను టార్గెట్ చేసి ప్రసంగించబోతున్నారన్నమాట. నిరుద్యోగులకు కేసీఆర్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది.
ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయబోతున్నారా?
వనపర్తిలో కేసీఆర్ ప్రకటన నిరుద్యోగుల్లో ఉత్కంఠను పెంచింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి భారీ ఎత్తున నోటిఫికేషన్ల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయబోతున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఉద్యోగాల భర్తీ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున విపక్ష పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయి. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల బదిలీలు కూడా పూర్తయినందున ఖాళీగా లెక్క తేలిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకే లెక్క తేలినంత వరకూ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేస్తారని నిరుద్యోగులు అంచనాలు పెంచేసుకుంటున్నారు.
ఉద్యోగాల భర్తీలో కేసీఆర్ మార్క్ చూపిస్తారా ?
కేసీఆర్ అంటే.. అంచనాలకు మించి చేస్తారన్న మార్క్ ఉంది. ఉదాహరణకు...ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయమే తీసుకుందాం. ఉద్యోగులు ఎంత కఠినమైన సమ్మె చేసినా పట్టించుకోలేదు. చివరికి వారి ఉద్యోగాలకుఎసరు వచ్చేసిందన్నసంకేతాలు కూడా పంపారు. అయితే ఆ తర్వాత అంచనాలకు మించి వారికి ప్రయోజనాలు కల్పిస్తూ ఆదరించారు. ఇదొక్కటే కాదు..చాలా అంశాల్లో కేసీఆర్ స్లైల్ ఇలాగే ఉంటుంది. నిరుద్యోగుల విషయంలోనూ కేసీఆర్ దాదాపుగా ఆర్టీసీ ఉద్యోగుల తరహాలోనే వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ చాలా కాలంగా త్వరలో అనే ప్రకటన చేస్తున్నారు కానీ ఇంత వరకూ ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదు. అందుకే ఇప్పుడు ఒక్క సారే లక్ష ఉద్యోగాలను భర్తీ చేసి.. సంచలన ప్రకటన చేస్తారన్న భావన ఎక్కువ మందిలో వస్తోంది.
నిరుద్యోగుల అసంతృప్తి చల్లార్చే మంత్రం చదువుతారా ?
తెలంగాణలో నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు కూడా అంగీకరిస్తారు. ఇటీవలి కాలంలో పలువురు నిరుద్యోగులు నోటిఫికేషన్లు రావడం లేదని సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యాయి. కేసీఆర్ ఇప్పుడు నిరుద్యోగుల అసంతృప్తిని చల్లార్చాలంటే.. వారి అంచనాలకు తగ్గట్లుగా ఉద్యోగ ప్రకటనలు చేయాల్సి ఉంటుంది. ఆ దిశగానే కేసీఆర్ ప్రయత్నిస్తారని.. వారి అసంతృప్తిని చల్లార్చే మంత్రమే అసెంబ్లీలో పఠిస్తారని టీఆర్ఎస్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
ఉద్యోగాల భర్తీ ప్రకటన కాక ఏం చెప్పినా రివర్స్ అయ్యే ప్రమాదం !
వనపర్తిలో కేసీఆర్ ఇచ్చిన టీజర్ చూస్తే.. ఉద్యోగాల భర్తీ ప్రకటన బాహుబలిలా ఉంటుందని నిరుద్యోగులు నమ్ముతున్నారు. అలా కాకుండా కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ది చేశామో... ఎంత మందికి ఉద్యోగాలిచ్చామో.., ఎన్ని లక్షల మందికి ప్రైవేటులో ఉపాధి కల్పించామో లెక్కలుచెబితే మాత్రం అంచనాలు తేలిపోతాయి. అదే సమయంలో అతి తక్కువ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ప్రకటించినా అసంతృప్తి డబుల్ అవుతుంది. అందుకే కేసీఆర్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని.. ఆ అంచనాలను అసలు ప్రకటన సమయంలో అందుకోవాలని నిరుద్యోగులు కోరుకుటున్నారు. టీఆర్ఎస్ వర్గాలూ కోరుకుంటున్నాయి. ఎందుకంటే రివర్స్ అయితే ఉద్యోగుల ఆగ్రహాన్ని పట్టడం కష్టం మరి !