KCR Speech: తొలి సభలోనే కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్!
KCR Speech: తొలి ఎన్నికల ప్రచార సభలోనే కాంగ్రెస్‌ను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారు. కాంగ్రెస్ మాయమాటలను నమ్మవద్దని ఓటర్లకు సూచించారు.
KCR Speech: తెలంగాణ ఎన్నికలపై నేటి నుంచి కేసీఆర్ దూకుడు పెంచారు. 51 మంది అభ్యర్థులకు బీఫారంలు అందించడంతో పాటు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు పోటీగా భారీ వరాలతో మ్యానిఫెస్టో ప్రకటించారు. అనంతరం ఎన్నికల ప్రచారానికి ఇవాల్టి నుంచే శ్రీకారం చుట్టారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో హుస్నాబాద్‌లో తొలి ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు.
బహిరంగ సభలో ప్రజలకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, ఆగమాగం కావొద్దని సూచించారు. స్పష్టమైన అవగాహనతో ఓటు వేస్తే ప్రజలు గెలుస్తారని, ఎవరో ఏదో చెప్పారని ఆలోచించకుండా ఓటు వేయవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు పది, పన్నెండు అవకాశాలు ఇచ్చారని, పదికిపైగా అవకాశాలు పొందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అంధకారం చేసిందని ఆరోపించారు. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆలోచించుకోవాలని ప్రజలకు తెలిపారు. 9 ఏళ్ల క్రితం విద్యుత్ కొరత, సాగునీరు, తాగునీరు కొరత ఉండేదని, సమస్యల పరిష్కారానికి కొన్ని నెలల పాటు మేధోమథనం చేశామన్నారు.
'అందరి సహకారంతో ఇవాళ రాష్ట్రాన్ని అన్ని అంశాల్లో నంబర్ వన్‌గా నిలిపాం.. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మనకు ఎవరూ సాటిరారు... పోటీ లేరు.. ఇప్పటివరకు సాధించిన విజయాలు ఇలాగే కొనసాగాలి. కొన్ని పార్టీలు వచ్చి ఇప్పుడు మాయమాటలు చెప్తాయి. ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. వారికి చాలాసార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అంధకారం చేశారు. 2014లో రూ.200గా ఉన్న పింఛన్లను రూ.వెయ్యికి పెంచాం. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడగానే పింఛన్లను రెట్టింపు చేశాం. ఎవరూ అడగకుండానే రైతుల కోసం రైతుబంధు తెచ్చాం. రైతుబంధుతో రాష్ట్ర వ్యవసాయ విధానమే మారిపోయింది. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ సరఫరా ఎలా ఉండేదో ప్రజలు ఆలోచించాలి.. ఇప్పుడు ఎక్కడా ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలటం లేదు' అని కాంగ్రెస్‌పై కేసీఆర్ విమర్శలు చేశారు.
'ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు, తాగునీరు తెచ్చుకున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గానికి ఆరు నెలల్లో లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయి. ప్రాజెక్టులు, షెడ్ డ్యామ్‌లతో భూగర్భ జలాలు పెరిగాయి. రాష్ట్రంలో పండిన ధాన్యం తరలించేందుకు వేల లారీలు సరిపోతలేవు. పారిశ్రామిక విధానంలో మనకు పోటీ లేదు. 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణను ఇప్పుడు దేశంలో నెంబర్ వన్‌గా నిలబెట్టాం. రాయి ఏంటో, రత్నమేదో గుర్తించి ఓటు వేయాలి.. ఓటు మన తలరాతను మారుస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రం సాధించుకోవడమే కాదు అభివృద్ది సాధించుకున్నాం.. తలసారి ఆదాయంలోనూ తెలంగాణది ఫస్ట్ ప్లేస్.. దళితబంధు లాంటి పథకం కాంగ్రెస్ ఎప్పుడో పెట్టి ఉంటే దళితులు బాగుపడేవారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే కరెంట్ సమస్యను తీర్చాం. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తున్నాం. కరెంట్, నీళ్లు, ఉద్యోగాలు లేక చాలామంది తెలంగాణ నుంచి వలస పోయారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు' అని కేసీఆర్ పేర్కొన్నారు.