![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vemulawada MLA: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని హాట్ కామెంట్స్, షాక్‌లో ఉండిపోయిన బీఆర్ఎస్ నేతలు
వేములవాడ అర్బన్ మండలం అణుపురంలో వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావుతో కలిసి గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవంలో చెన్నమనేని రమేష్ మాట్లాడారు.
![Vemulawada MLA: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని హాట్ కామెంట్స్, షాక్‌లో ఉండిపోయిన బీఆర్ఎస్ నేతలు Vemulawada MLA Chennamaneni Ramesh makes hot comments BRS government Vemulawada MLA: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని హాట్ కామెంట్స్, షాక్‌లో ఉండిపోయిన బీఆర్ఎస్ నేతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/ca5ab350b82db098d277402454006c0d1696750492282234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. భారత పౌరసత్వం వ్యవహారంలో ఆయన తరచూ వార్తల్లో ఉండే సంగతి తెలిసిందే. నేడు ఆయన వేములవాడ అర్బన్ మండలం అణుపురంలో వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావుతో కలిసి గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవంలో చెన్నమనేని రమేష్ మాట్లాడారు. మధ్య మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఉద్ధేశించి తన మనసులో మాటలన్ని చెప్పారు.
మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకపోతే తానే తిరగబడతానని ఎమ్మెల్యే అన్నారు. ముంపు గ్రామాలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండి ఉంటే ఎప్పుడో సమస్యలు పరిష్కారం అయ్యేవని అన్నారు. ఆ విషయాన్ని గతంలో తాను సూటిగా కేటీఆర్‌తో కూడా చెప్పినట్టు గుర్తు చేశారు. అసెంబ్లీలో ముంపు గ్రామాల సమస్యలపై అధికార పక్షంలాగా కాకుండా తాను ఓ ప్రతిపక్ష నేతగా పోరాటం చేశానని అన్నారు. తాను మంత్రి అయినా బాగుండేదని అన్నారు. అలా జరిగి ఉంటే మధ్య మానేరు ప్రాజెక్టు ముంపు సమస్య తీరేదని అన్నారు.
మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలపై తాను ప్రశ్నించాననే విషయం ప్రజలకు తెలియాలని అన్నారు. ఆ సమస్య పరిష్కారం కోసం తాను ఎక్కని గడప, దిగని గడప, కలవని అధికారి లేరని అన్నారు. కాళ్లు పట్టుకోవడం తప్ప అన్నీ చేశానని అన్నారు. తాను చెన్నమనేని రాజేశ్వరరావు కూమారుడిని కాబట్టి, ఆత్మగౌరవం వల్ల ఆ కాళ్లు పట్టుకొనే పని చేయలేదని అన్నారు. సదరు సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ పోరాటం చేస్తానని అన్నారు.
మిడ్ మానేరు ముంపు నిర్వాసితుల సమస్యల నుంచి పాఠాలు నేర్చుకోవాలని తన పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు సూచిస్తున్నానని అన్నారు. ఇటీవల కేసీఆర్ విడుదల చేసిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో వేములవాడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన చెన్నమనేనికి టికెట్ ఇవ్వని సంగతి తెలిసిందే. ఆయనకు పౌరసత్వ సమస్య ఉందనే ఉద్దేశంతో అధిస్ఠానం టికెట్ ఇవ్వలేదు.
తాజాగా, చెన్నమనేని రమేష్ బాబు షాకింగ్ కామెంట్స్‌తో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహరావు షాక్‌లో ఉండి కూర్చుండిపోయారు. మరోవైపు ముఖ్యమంత్రి వ్యవసాయ సలహాదారుగా చెన్నమనేనిని ఇటీవలే నియమించారు. చెన్నమనేని, చల్మెడ మధ్య సయోధ్య కుదిరిందని అనుకున్న వేళ.. తాజాగా ఎమ్మెల్యే రమేష్‌బాబు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)