Singareni Privatization: సింగరేణి ప్రైవేటీకరణపై చర్చకు రెడీ - ప్లేస్, టైమ్ ఫిక్స్ చేయాలని BRS నేతలకు ఈటల సవాల్
Singareni Privatization: కేంద్ర సర్కారు సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తుందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఈటల రాజేందర్ అన్నారు.
Singareni Privatization: ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ సర్కారుపై హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ సర్కారు పదే పదే విషాన్ని చిమ్ముతోందని ఈటల మండిపడ్డారు. హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఈటల.. సింగరేణిని కేంద్ర సర్కారు ప్రైవేట్ పరం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఈటల చెప్పుకొచ్చారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తేదీ, సమయం, ప్లేస్ చెబితే చర్చకు వస్తానని ఈటల్ సవాల్ చేశారు.
సింగరేణిని ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన మాకు లేదు
సింగరేణి సంస్థను ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన తమకు లేదని రామగుండం సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారని ఈటల గుర్తు చేశారు. సింగరేణి విధివిధానాలపై రాష్ట్రానిదే పెత్తనం అని, కేంద్ర సర్కారు వాటిలో జోక్యం చేసుకోలేదని ఈటల తెలిపారు. సింగరేణి ప్రైవేటీకరణనా లేదా బొగ్గు గనుల ప్రైవేటీకరణనా కేసీఆర్ చెప్పాలని ఈటల అన్నారు. బొగ్గు, మట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని, ప్రభుత్వం ఎందుకు ఆ పనులు చేయడం లేదని ఈటల బీఆర్ఎస్ నాయకులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సింగరేణి సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు. సింగరేణిలో మూడు బొగ్గు గనులను ప్రైవేట్ వారికి ఇచ్చి మైనింగ్ చేస్తుంది నిజామా కాదా అని ఈటల ప్రశ్నించారు. సింగరేణి కంపెనీకి ఇవ్వాల్సిన 20 కోట్ల రూపాయల బాకీలను రాష్ట్ర సర్కారు ఇప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని ప్రశ్నలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచిస్తున్న కేసీఆర్.. మొదట తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఆర్టీసీకి న్యాయం చేయాలని ఎద్దేవా చేశారు.
ఇష్టానుసారంగా 216 మైన్స్ కేటాయించడం వల్ల లక్షా 86 వేల కోట్ల నష్టం
ఆర్టీసీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, అజాంజాహి మిల్లు లాంటి తెలంగాణ సంస్థల గురించి ఆలోచించి, వాటిని అభివృద్ధి చేసి ఇతరవాటి గురించి ఆలోచించాలని ఈటల రాజేందర్ చురకలంటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ పురోగమిస్తుందని ఈటల ధీమా వ్యక్ం చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు కేసీఆర్ 25 కోట్ల రూపాయలు ఇచ్చారని ఈటల ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని తెలిపారు. ఎన్నికల ముందు లేదా తర్వాత రెండు పార్టీలు కలుస్తాయని, ఇది ఖాయమని ఈటల జోస్యం చెప్పుకొచ్చారు.
6300 కోట్ల రూపాయలతో రామగుండంను ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించిన సందర్భంగా.. 51 శాతం రాష్ట్రం వాటా ఉన్న తర్వాత కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లు ఈటల గుర్తు చేశారు. దానికి సమాధానం చెప్పలేని సీఎం కేసీఆర్... ఇప్పుడు మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మైన్స్ మినరల్స్ రెగ్యులేషన్ ఆక్ట్ 1957 ప్రకారం యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా 216 మైన్స్ కేటాయించడం వల్ల లక్షా 86 వేల కోట్ల నష్టం జరిగింది అని కాగ్ రిపోర్ట్ ఇచ్చినట్లు గుర్తు చేశారు.