Karimnagar News: సాయానికి కేరాఫ్ అడ్రస్ ఆయన, నిరుపేదలను ఆదుకుంటున్న సమాజ సేవకుడు
Telangana News | ఇతరుల కష్టాన్ని చూసి చలించేది కొందరైతే, వారి కష్టాలను ఎలాగైనా తీర్చాలని తాపత్రయ పడేది మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన అలాంటి అరుదైన వ్యక్తి రేణిగుంట రమేష్.
కరీంనగర్: ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు అంటే కాలక్షేపానికి కాదు సామాజిక సేవకు కూడా ఉపయోగించవచ్చునని ఓ వ్యక్తి నిరూపించారు. నిరుపేదలకు అండగా నిలిచేందుకు Facebookను వేదికగా మార్చుకున్నారు. కష్టకాలంలో కొట్టుమిట్టాడుతున్న వారికోసం దేశ విదేశాలలో ఉండే దాతల నుంచి విరాళాలను సేకరిస్తున్నారు. ఆయన పెట్టే పోస్టులకు తెలుగు రాష్ట్రాల నుంచి కాదు విదేశాలలో ఉండే కొందరు ఎన్నారైలు కూడా స్పందిస్తున్నారు. అయినవారినే పరాయి వాళ్లలాగా చూస్తున్న నేటి రోజుల్లో కూడా ఎవరో మొక్క పరిచయం లేని అనాథల కోసం ఆరాటపడుతున్నారు. ఈ సమాజ సేవకుడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ వివరాలపై ఓ లుక్కేయండి.
సోషల్ మీడియా ఈ రోజుల్లో మంచికైనా, చెడుకైనా అది ఉపయోగించే వారిని బట్టి ఉంటుంది. కానీ ఎందరికో అవకాశాలు ఇచ్చింది. కొందర్ని ఫేమస్ చేసింది ఈ వేదిక. కానీ ఇతరుల జీవితాలలో కూడా వెలుగు నింపేందుకు సోషల్ మీడియా ఉపయోగపడుతుందని నిరూపించారు ధర్మపురికి చెందిన రేణిగుంట రమేష్. ధర్మపురికి మండలం బుద్దేశిపల్లి కి చెందిన పాప పేరు వైష్ణవి కొన్ని సంవత్సరాల కిందట స్కూల్లో ఆడుకుంటూ హఠాత్తుగా కిందపడిపోయింది. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చూపిస్తే కొద్ది రోజులకి మామూలు స్థితికి వచ్చింది. కానీ మరికొద్ది రోజుల తర్వాత మళ్లీ అనారోగ్యం బారిన పడింది. తీవ్రమైన జ్వరంతో కదల లేకుండా మంచానికి పరిమితం అయింది.
కరీంనగర్, హైదరాబాద్ ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో హాస్పిటల్లో చూపించి.. లక్షలు ఖర్చు చేసినా డాక్టర్లు వ్యాధిని కనుక్కోలేక పోయారు. దీనితో వైష్ణవి పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రమేష్. దయచేసి ఈ పాపకు సహాయం చేయండి అంటూ పెట్టిన పోస్ట్ కు ఎంతోమంది స్పందించారు. వైష్ణవి కుటుంబ సభ్యుల పరిస్థితి తెలుసుకొని రాష్ట్రాలే వారి కాకుండా విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు కూడా ఆమె పేదరికం, వారి సమస్య తెలుసుకున్నవారు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దీనితో ఊహించని విధంగా తొమ్మిది లక్షల రూపాయలు విరాళాలు ఫేస్ బుక్ మిత్రుల ద్వారా అందాయి.
మెదడులో సమస్య ఉందన్నారు - వైష్ణవి తల్లి రాగుల దుర్గ
వచ్చిన డబ్బుతో హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స అందించారు మెదడులో సమస్య ఉందని తెలుసుకున్న వైద్యులు ఆపరేషన్ చేశారు. మిగతా డబ్బులు చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ సహాయంతో ప్రభుత్వం తరఫున సహాయం అందించారు. ఫేస్బుక్ ద్వారా అందిన డబ్బులు కొంత ఖర్చు కాగా మిగిలిన డబ్బులు వైష్ణవి ఎకౌంట్లో ఫిక్స్ డిపాజిట్ చేశారు. ఆపరేషన్ తర్వాత కోలుకున్న ప్రస్తుతం ఆమె పరిస్థితి మాత్రం మంచానికే పరిమితమైంది అంటూ తల్లిదండ్రులు వారి గుండెలోని బాధను ఏబీపీ దేశం (ABP Desam)తో పంచుకున్నారు.
2015 సంవత్సరంలో వైష్ణవి వైద్యం కోసం తొలిసారిగా రమేష్ సోషల్ మీడియా ద్వారా నిధులను సేకరించడం మొదలుపెట్టారు. ఎంతోమంది ఎన్నారైలు సంప్రదించారు చిన్నారి వైష్ణవి వైద్యం కోసం మూడు లక్షలు అవసరం కాగా ఏకంగా తొమ్మిది లక్షలు సమకూరాయి. విద్య, వైద్యం సహా ఇండ్లు లేని వారికి ఇంటిని నిర్మించాలనే ధ్యేయంతో రమేష్ ముందుకు సాగుతున్నారు ఈ తొమ్మిది సంవత్సరాలలో సుమారు ఒక కోటి 60 లక్షల నిధులను సేకరించారు. రమేష్ చేస్తున్న సేవలను చూసి ఎన్నారైలు కూడా ఫిదా అయ్యారు. ఫోన్ సోషల్ మీడియా ద్వారా సంప్రదించి మరి కొంతమందికి సహాయం చేసేందుకు కూడా తాము సిద్ధం అంటు ప్రోత్సహిస్తున్నారు ఎన్నారైలు.
ఇప్పటివరకు 138 మంది కుటుంబాలకు సహాయం అందించిన రమేష్ ఇప్పటివరకు 28 మందికి ఇళ్లను నిర్మించారు మరి కొంత మందికి విద్య వైద్యానికి సాయం అందించారు. తనను సంప్రదించిన వ్యక్తులను దానికి అర్హులని తెలుసుకున్న తర్వాతనే రమేష్ వారి దీనస్థితిని వివరిస్తూ ప్రతినెల మొదటి వారంలో సోషల్ మీడియాలో పోస్టును పెడతారు. ధర్మపురికి చెందిన లావణ్య భర్త మరణించి ఇద్దరి చిన్నారాలతో కష్టపడుతుంటే దాతల సాయంతో ఆమెకు ఇల్లును కట్టించారు. ధర్మపురి మండలం బుద్దేశి పల్లి గ్రామానికి చెందిన కిష్టయ్యకి దుబాయిలో ప్రమాదం జరగగా దిగి గ్రామానికి వచ్చిన తర్వాత ఆటో కొనిచ్చి జీవన ఉపాధి కలిగించారు. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు వందమందికి పైగా ఓ శ్రేయోభిలాషిగా స్నేహితుడిగా అండగా నిలుస్తున్నారు రమేష్. తన వంతుగా స్పందించి ఫేస్ బుక్ పోస్టుల ద్వారా ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపుతున్న రమేష్ కి హ్యాట్సాఫ్ చెబుదాం. తోటివారి సమస్యలు తెలుసుకుని విరాళాలు అందిస్తున్న దాతలకు కూడా కృతజ్ఞతలు.