Karimnagar News: జిల్లా ఆస్పత్రిలో జాబుల పేరుతో దళారుల దందా- జడ్పీటీసీలు ఆగ్రహం
Karimnagar News: కరీంనగర్ జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీలు సమస్యలను ఏకరవు పెట్టారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Karimnagar News: కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో ఉద్యోగాల పేరుతో దళారులు దందా చేస్తున్నారని జడ్పీటీసీలు ఆరోపించారు. ఇతర సేవల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇందుకోసం లక్ష నుండి లక్షన్నర రూపాయలు ఇచ్చిన వారికి అవకాశం ఇస్తామని దళారుల అక్రమాలు చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల వైఖరిపై జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కరీంనగర్ లోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు అధికారులను నిలదీశారు. నామమాత్రంగా సమావేశాలకు హాజరు అవుతున్నారని ప్రతి సమావేశంలో తమ ఇబ్బందులను తేలిగ్గా తీసుకుంటున్నారంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
'ఆస్పత్రిలో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో చెప్పండి'
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాఖల వారీగా పనితీరును సభ్యుల ముందు ఉంచారు. మానకొండూరు జడ్పీటీసీ సభ్యులు శేఖర్ రావు మాట్లాడుతూ, జిల్లా ఆస్పత్రిలో ఉద్యోగం కోసం తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. జిల్లా ఆస్పత్రిలో అసలు ఏ తరహా పోస్టులను భర్తీ చేస్తున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని సూపరింటెండెంట్ ను నిలదీశారు.
'ప్రజాప్రతినిధులను ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవట్లేదు'
ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే చికిత్స విషయంలోనూ లోపాలు ఉన్నాయని, ప్రజాప్రతినిధిగా ఫోన్ చేసినా ఎవరూ స్పందించడం లేదని ఆయన అన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు జరగడం లేదని, ఇందులో తమకు సభ్యులుగా అవకాశం కల్పించాలని శంకరపట్నం జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి కోరారు. సదరన్ ధ్రువపత్రాలను సకాలంలో ఇవ్వకుండా జిల్లా ఆస్పత్రి డీఆర్డీఏ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని జమ్మికుంట జడ్పీటీసీ సభ్యులు శ్రీరామ్ శ్యామ్ తెలిపారు. పింఛన్లు అందుకోవాలి అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి కరీంనగర్ లోని క్యాంపునకు బాధితులు వెళ్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. శంకరపట్నం మండలం లోని దళితవాడలో విద్యుత్ సరఫరా నిలిపి వేశారని శ్రీనివాస్ రెడ్డి తెలపడంతో స్పందించిన మంత్రి గంగుల.. అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని డీఈని ఆదేశించారు.
'గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి'
ఎస్సారెస్పీ భూముల పలుచోట్ల ఆక్రమణకు గురవుతున్నాయని, ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారని కో-ఆప్షన్ సభ్యులు శుక్రవారం సమావేశంలో చెప్పారు. కాకతీయ కాలువ సమీపంలో ఇవి అధికంగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆదేశించారు. వైకుంఠధామాలు ప్రారంభించకపోవడంతో గ్రామాల్లో ఇబ్బంది ఎదురవుతోందని కొందరు సభ్యులు తెలుపగా.. వాటి విషయమై అధికారులతో మాట్లాడుతానని, ఎక్కడా ఇబ్బంది ఉందో తెలుసుకుంటామని ఛైర్ పర్సన్ విజయ తెలిపారు. దళిత బంధు కింద లబ్ది దారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లకు సంబంధించిన పురోగతిని జడ్పీ ఛైర్ పర్సన్ విజయ సంబంధిత అధికారులను అడిగారు. ఆయా నియోజకవర్గాల వారీగా గ్రౌండింగ్ వివరాలను సేకరిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారిగా నాగార్జున తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు యువతకు ఉపయోగపడేలా ఉండేలా చూడాలని కొందరు సభ్యులు కోరారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్మన్ విజయ, కలెక్టర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.