Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
Vizag Skywalk | వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు..? నిర్మాణం పూర్తయినా నెలల తరబడి ఎదురుచూపులు ఎందుకు? అని విశాఖపట్నం వాసులు చర్చించుకుంటున్నారు.

Vizag Skywalk Glass Bridge | "భవిష్యత్తులో ఏ ఇజమూ ఉండదు.. కేవలం టూరిజం మాత్రమే ఉంటుంది " అని ఏపీ సీయం చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. దాని తగ్గట్టే ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్రాజెక్టులు చాలానే పట్టాలు ఎక్కాయి. కొన్ని ప్రభుత్వమే చేపడుతుంటే మరికొన్ని పీపీపీ మోడల్ లో తయారవుతున్నాయి. అయితే మాటల్లో చెప్పినంత వేగంగా ఇవి రియాల్టీ లోకి రావడం లేదు. చాలా విషయాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ బలంగానే ఉంది. అలాంటి వాటికి ఉదాహరణ వైజాగ్ లోని కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్. నెలల క్రితమే తయారైన ఈ బ్రిడ్జ్ ఇప్పటికీ ఓపెన్ కాకపోవడం వైజాగ్ వాసుల్లో అసహనాన్ని రేకెత్తిస్తోంది
ఆగస్టు 15.. సెప్టెంబర్ 25.. ఇది నవంబర్.. ఇంకా ఓపెనింగ్ ఫిక్స్ కాలేదు
భారతదేశంలోనే ఇంకెక్కడా లేని అతి పెద్ద కేంటి లివర్ గ్లాస్ బ్రిడ్జ్ విశాఖలో రెడీ అయిందనే వార్త ఒక్క వైజాగ్ వాసులకే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టులకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. కైలాసగిరి కొండ అంచు ఫై నుండి గ్లాస్ బ్రిడ్జిపై నడుస్తూ పర్వతం,లోయ, అడవి,సముద్రం ఇలా విభిన్నమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇస్తుందని అందరూ ఉప్పొంగి పోయారు. మొదట్లో ఆగస్టు 15 టైమ్ కి రెడీ అవుతుందని భావించినా పనులు ఆలస్యం వల్ల సెప్టెంబర్ లో ప్రారంభిస్తామన్నారు.
సెప్టెంబర్ 25 కి బ్రిడ్జి ఓపెన్ అవుతుందని వార్తలు కూడా వచ్చాయి. తర్వాత అక్టోబర్ వచ్చింది, దసరా, దీపావళి కూడా వెళ్లిపోయాయి. నవంబర్ నెల కూడా వచ్చేసింది. అయినప్పటికీ ఈ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఎప్పుడు అనేది తెలియక వైజాగ్ వాసులు అయోమయంలో పడ్డారు. టూరిజం పరంగా ఎంతో పొటెన్షియల్ ఉన్న వైజాగ్ లో ఈ గ్లాస్ బ్రిడ్జ్ పెద్ద అట్రాక్షన్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.
7 కోట్లు.. 55 మీటర్లు.. 100మందిని ఒకేసారి ఆపగలిగే దృఢత్వం
ఏడు కోట్లు ఖర్చుపెట్టి 55 మీటర్ల పొడవున ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని నిర్మించారు. కేరళ లో ఇలాంటి బ్రిడ్జ్ ఇంకొకటి ఉంది కానీ దాని పొడవు 38 మీటర్లే. ఇదే ఏడాది మీజోరామ్ లో కూడా ఐజ్వాల్ స్కై వాక్ పేరుతో ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు కానీ దాని పొడవు 10 మీటర్లే. ఎలా చూసినా విశాఖపట్నం లోని స్కై వాక్ బ్రిడ్జ్ దేశం లోనే చాలా పెద్దది. 250km వేగం తో వీచే గాలులను సైతం తట్టుకునేలా దీన్ని నిర్మించినట్టు చెబుతున్నారు. VMRDA ఈ నిర్మాణన్ని సూపర్ వైజ్ చేస్తుండగా కేరళకు చెందిన RJ అడ్వవెంచర్స్ సంస్థ నిర్మాణం చేసింది. ఇది ఒకేసారి 100 మంది బరువును తట్టుకుంటుంది అని నిర్వాహకులు చెబుతున్నారు.

లోకేష్‌కు టైం దొరకట్లేదా...?
VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఈ స్కై వాక్ బ్రిడ్జ్ ఫై ప్రత్యేక దృష్టి పెట్టారు.. చాలాసార్లు వెళ్లి నిర్మాణాన్ని పర్యవేక్షించి వచ్చారు. ఆయన ఈ స్కైవాక్ బ్రిడ్జిని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఓపెన్ చేయించాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత లోకేష్ రెండుసార్లు వైజాగ్ వెళ్లి వచ్చారు. అయినప్పటికీ స్కై వాక్ బ్రిడ్జ్ ఓపెన్ కాలేదు. లోకేష్ టైం దొరక్కే గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ లేట్ అవుతుందని వీఎంఆర్డిఏ వర్గాలు చెబుతున్నాయి. 
వైజాగ్ పార్టనర్ షిప్ టైంలోనైనా ప్రారంభిస్తారా?
ఈ నెలలో ( నవంబర్ 14-15 తేదీల్లో ) వైజాగ్ లో రెండు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు జరగబోతుంది. పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తోంది. దేశ విదేశాల్లోని పారిశ్రామిక వ్యాపార అతిథులను ఆహ్వానించడం కోసం సీఎం చంద్రబాబు లోకేష్ విదేశీ పర్యటనలు సైతం చేసి వచ్చారు. వైజాగ్ లోని టూరిజం అట్రాక్షన్లు అన్నింటికీ క్రొత్త అందాలు దిద్దుతున్నారు. మరి ఆ సందర్భంగానన్నా వైజాగ్ స్కై వాక్ బ్రిడ్జ్ ని అందుబాటులోకి తీసుకొస్తారో లేదో చూడాలని సగటు విశాఖ వాసి కోరుతున్నాడు.





















