MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
బెల్లంపల్లిలో ఆరిజిన్ పాల సంస్థను ప్రారంభించడానికి తమ వద్ద భారీగా ముడుపులు తీసుకొని తమ మీదనే ఉల్టా కేసులు పెట్టించాడని సంస్థ పార్టనర్ శైలజ ఆరోపించారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆడియో, కొన్ని వాట్సప్ చాటింగ్ వివరాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. బెల్లంపల్లిలో ఆరిజిన్ పాల సంస్థను ప్రారంభించడానికి తమ వద్ద భారీగా ముడుపులు తీసుకొని తమ మీదనే ఉల్టా కేసులు పెట్టించాడని సంస్థ పార్టనర్ శైలజ ఆరోపించారు. ఆయనకి తెలిసిన వ్యక్తులను ఇందులో షేర్ హోల్డర్స్ గా ఉంచాలని ఎమ్మెల్యే చెప్పారని, తాము కూడా ఒప్పుకున్నామని అన్నారు. తమతో వచ్చిన ఓ అమ్మాయిని కావాలని ఎమ్మెల్యే కోరాడని ఆరోపించారు. వేరే బ్రోకర్ ల ద్వారా అమ్మాయిల సప్లై గురించి శైలజ ఆరోపించారు.
అమ్మాయిల సప్లై కోసం వాట్సప్ లో టాబ్లెట్ అనే కోడ్ వాడారని ఆరోపించారు.
‘‘చాలా సార్లు అతనికి అమ్మాయిలను సప్లై చేశారు. తననతో బలవంతంగా మందు తాగించే ప్రయత్నం చేశాడని, లైంగికంగా వేధింపులకు గురిచేశాడని చెప్పారు. తమని అతని ఇంటికి పిలిపించి పోలీసులకు అప్పజెప్పాడని ఆమె వెల్లడించింది. పోలీసులు కూడా ఎమ్మెల్యే చిన్నయ్య కే వత్తాసు పలుకుతున్నారని, రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తనకు ఎమ్మెల్యే, అయన అనుచరుల ద్వారా ప్రాణహాని ఉందంటు శైలజ ఆరోపిస్తోంది.
సబ్సిడీ, రుణ పద్ధతిలో గేదెలు, ఆవులు ఇస్తామని జిల్లా పాడి రైతులకు టోకరా వేసిన ఓ ప్రైవేటు డెయిరీ విషయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. ఆ సంస్థ ప్రారంభించే ముందు నిర్వహకుడితో హైదరాబాద్ లో అల్పాహారం నుంచి రాత్రి పూట మందు, విందు, పొందు కూడా పొందినట్లు ఆరోపణలు చేస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆరిజిన్ అనే ప్రైవేటు డెయిరీ యూనిట్ నెలకొల్పి పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని గత ఏడాది ప్రచారం చేసింది. మొదట ప్రైవేటు డెయిరీని అభివృద్ధి చేసుకునేందుకు దుర్గం చిన్నయ్య దగ్గరకు వెళ్ళగా తనకు చెందిన రెండు ఎకరాల భూమిలోనే ఈ ఫాంను నిర్వహించడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని భూమి పూజ కూడా చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి దుర్గం చిన్నయ్యతో పాటు, జిల్లాస్థాయి వెటర్నరి అధికారులు కూడా పాల్గొన్నారు. ఆ సంస్థను ఆ ప్రాంతంలో నెలకొల్పడం కోసం చిన్నయ్య తమని అన్ని రకాలుగా వాడుకొని తమపై తప్పుడు కేసులు పెట్టారని అంటున్నారు ఆరిజిన్ సంస్థ బాగస్వామి శైలజ. దీనికోసం ఎమ్మెల్యే మందు పార్టీ, విందు, 'పొందు' కూడా సమకూర్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ మెసేజ్ లు వెలుగులోకి వస్తుండడం విస్తుపోయేలా చేస్తోంది.
వాట్సాప్ కోడ్ చాటింగ్
‘‘ట్యాబ్లెట్లు కావాలి, రిలాక్సేషన్ పొందాలి, మీరే ఎంజాయ్ చేస్తున్నారు?, ఆ అమ్మాయి ఉందా? ఎంజాయ్ బాస్’’ అంటూ సాగిన సంభాషణల్లో అనేక కోణాలు బయటపడుతున్నాయి. పలుమార్లు హైదరాబాద్ లోని లొకేషన్లు షేర్ చేసుకోవడాలు, కోడ్ భాషలో చాటింగ్ అన్నీ అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఆ చాటింగ్ లో డెయిరీపై కూడా చర్చించారు. ఆ చాటింగ్‌లో ప్రజాప్రతినిధి అమ్మాయిల గురించి ఆరా తీయడం, ఆ నిర్వహకుడు తన స్టాఫ్ కాకుండా బయట వాళ్లతో ఎంజాయ్ చేయాలంటూ చాటింగ్ చేయడం ఒకింత విస్మయానికి గురి చేస్తున్నాయి.
ఇంతలా వీరి మధ్య సమన్వయం ఉన్నప్పటికీ వీరి సంబంధం ఎక్కడ చెడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ కాదని, ప్రైవేటు సంస్థకు తోడ్పాటు ఇచ్చేందుకు ఆ ప్రజాప్రతినిధి మొదట ఆసక్తి చూపించారు. ఇందుకోసం ఆ సంస్థ నిర్వహించిన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. విజయా డైరీకి చెందిన యజమానులు, కేటీఅర్ వద్దకు ఈ సంస్థకు సంబంధించిన విషయం తీసుకుపోవడంతోనే వారి రిలేషన్ చెడిందని, వారి పైన తప్పుడు కేసులు పెట్టించారని జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. తనను కేసుల పాలు చేసినందుకు ఆ నిర్వాహకుడు ఆధారాలతో పలు విషయాలు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ డైరీ ప్రారంభంలో పాడి రైతులు వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లిస్తే రుణ రూపంలో పాడి పశువులు ఇస్తామని నమ్మించింది. పలు రకాల స్కీంలతో రైతులను ఆకర్షించింది. రైతు వాటాగా కనీసం రూ.70 వేల నుంచి రూ.3.50 లక్షల వరకు తీసుకున్నారు. సంస్థ కొంత మొత్తం కలిపి రుణం రూపంలో పాడి పశువులు ఇస్తుందని చెప్పడంతో రైతులు నమ్మి రూ.లక్షల్లో డబ్బులు ముట్టజెప్పారు. రూ.708 చెల్లిస్తే పశువులు చనిపోతే గరిష్టంగా రూ.50 వేల బీమా కూడా చెల్లిస్తామని చెప్పారు. కానీ పశువువుల చనిపోతే బీమా కూడా చెల్లించకపోవడం, చెక్కులు బౌన్స్ కావడంతో వివాదాలు ఏర్పడ్డాయి. వీటన్నింటిపై గత జనవరిలో తాండూర్, బెల్లంపల్లి, భీమారం, జైపూర్, సోమగూడెం, కాసిపేట, నెన్నెల తదితర మండలాల్లో కేసులు నమోదయ్యాయి. నిందితులు బెయిల్ పై బయటకు రాగా, విచారణ సాగుతోంది. తమని అన్ని రకాలుగా వాడుకున్న చిన్నయ్య కావాలనే తమని తన ఇంటికి పిలిపించి పోలీసులకు పట్టించి మూడు రోజులు మాకు టార్చర్ చూపెట్టారని శైలజ ఆరోపిస్తున్నారు. తమని తన అనుచరులతో చంపాలని చూస్తున్నాడని, తమకు ఏం జరిగినా పూర్తి బాధ్యత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యదేనని ఆమె వాపోయారు.