BJP For Farmers: శనివారం రైతు సమస్యలపై బీజేపీ రణభేరీ, నేతల వడ్ల కల్లాల సందర్శన
Telangana News: రైతుల సమస్యల సాధన కోసం బీజేపీ నేతలు పోరాటం చేయనున్నారు. కరీంనగర్ బీజేపీ నేతలు వడ్ల కల్లాలు పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకోని వారికి అండగా నిలవాలన్నారు బండి సంజయ్.
Karimnagar News: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైతు సమస్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) రణభేరీ మోగించింది. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించిన బీజేపీ, మరోవైపు రైతుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా రణభేరీ మోగించింది. అందులో భాగంగా బీజేపీ శ్రేణులు తమ ప్రాంతాల్లో వడ్ల కల్లాలను సందర్శించి రైతులకు అండగా నిలవాలని పార్టీ రాష్ట్ర అధిష్టానం నిర్ణయించింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి పండించిన వడ్లను కల్లాల వద్దకు తీసుకొచ్చి రోజలు గడుస్తున్నా.. కొనుగోలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కల్లాల సందర్శనకు నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మండల కమిటీలు, ఆ పైస్థాయి నేతలతో శుక్రవారం నాడు (మే 17న) టెలికాన్ఫరెన్స్ నిర్శహించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించేందుకు వడ్ల కల్లాలను సందర్శించాలని పార్టీ శ్రేణులను కోరారు. రైతుల పంట నష్టం వివరాలు సేకరించడంతోపాటు ఎలాంటి తరుగు సంబంధం లేకుండా వడ్లు కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బండి సంజ య్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ ప్రకారం వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సన్నాలు, దొడ్డు అనే తేడా లేకుండా అన్ని రకాల వడ్లకు ఈ బోనస్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12వేలు ఇచ్చేలా ప్రభుత్వంపై పోరాడుతూ, రైతుల కోసం నిరసనలు తెలపాలని సూచించారు.
ప్రభుత్వం వద్ద నిధులు లేవు
రైతులకు ఇచ్చిన హామీలతోపాటు 6 గ్యారంటీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే దాదాపు రూ.35 వేల కోట్లు కావాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు. 6 గ్యారంటీల అమలుకు మరో రూ.లక్ష కోట్ల నిధులు అవసరం అని.. హామీల అమలకు నిధుల సేకరణకు ప్రణాళికలు రూపొందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అది కప్పిపుచ్చుకునేందుకు ‘స్థానిక సంస్థల’ ఎన్నికలను తెరపైకి తీసుకొస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రజలతోపాటు రైతులు తీవ్రమైన సంక్షోభంలో పడిపోయారంటూ మండిపడ్డారు. రైతులు పండించిన వడ్లను కూడా అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రైతులకు అండగా నిలవడంతోపాటు వడ్లను కొనుగోలు చేసే వరకు, బోనస్ ఇచ్చే వరకు పోరాడాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
బీజేపీ కార్యాచరణ ఇదే..
రైతుల కోసం పోరాటంలో భాగంగా శనివారం వడ్ల కల్లాలను సందర్శించాలని బీజేపీ శ్రేణుల్ని ఆదేశించారు. మే 19 (ఆదివారం) నాడు అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి రైతులు బాధలను అందరికీ తెలియజేయాలన్నారు. సోమవారం ( మే 20న) అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో తహిసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు రైతు సమస్యలపై వినతి పత్రం అందజేయాలన్నారు. ఈనెల 21న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రైతుల పక్షాన దీక్షలు చేపట్టనున్నారు. రాష్ట్రం ప్రభుత్వం దిగిరాకపోతే బీజేపీ చేపడుతున్న ఆందోళనను మరింత తీవ్రతరం చేసేలా కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు.