(Source: ECI/ABP News/ABP Majha)
Karimnagar News : జమ్మికుంట ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి, ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు
Karimnagar News : జమ్మికుంటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విద్యార్థిని తల వెనుక భాగం, పాదాలపై గాయాలున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Karimnagar News : కరీంనగర్ జిల్లా జమ్మికుంట న్యూ మిలీనియం స్కూల్ హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. 9వ తరగతి చదువుతున్న తిప్పిరెడ్డి అఖిల అనారోగ్యంతో హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని పాఠశాల యాజమాన్యం బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థిని మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని శరీరంపై గాయాలున్నాయని తల వెనుక భాగంలో, పాదాల వద్ద దెబ్బలు ఉన్నాయని ప్రశ్నిస్తే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోందని బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంధుమిత్రులతో కలిసి వారంతా స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. అయితే సమాధానం ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం తాళాలు వేసుకొని వెళ్లిపోవడంతో బాలిక మృతిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
మద్నూర్ కేజీబీవీలో విద్యార్థుల అవస్థలు
రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం చేస్తున్నప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంకా చాలా పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కరవయ్యాయి. తరగతి గదుల్లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ కేజీబీవీలో చదువుతున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు. హాస్టల్ లో మొత్తం 250 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరికి సరిపడా భవనం లేదు. ఇరుకైన గదుల్లోనే టీచర్లు పాఠాలు చెబుతున్నారు. ఆ గదుల్లోనే విద్యార్థులకు హాస్టల్ నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మద్నూర్ కేజీబీవీ విద్యార్థుల హాస్టల్ కోసం భవనం నిర్మాణం ప్రారంభించి 9 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకు పూర్తి కాలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇరుకు గదుల్లో సరైన సదుపాయాలులేక స్టూడెంట్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం స్పందించాలని
కనీసం మంచి నీటి సౌకర్యం కూడా లేదని విద్యార్థులు వాపోతున్నారు. 250 మందికి కేవలం 5 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. విద్యార్థులు స్నానాలకు క్యూకట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త భవనం ఇవ్వాలంటూ ఎన్నిసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు విద్యార్థులు. మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందిగా ఉందంటున్నారు. ఒకే గదిలోనే చదువుకోవడం అందులోనే పడుకుంటున్నామని చెబుతున్నారు స్టూడెంట్స్. తమకు భవనం కావాలంటూ ఏబీపీ దేశానికి విన్నవించుకున్నారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.