Kaleshwaram Commission Report: కాళేశ్వరం కమిషన్ నివేదిక సమర్పించిన జస్టిస్ పీసీ ఘోష్ - సీల్డ్ కవర్‌లో అందజేత - సంచలన విషయాలుంటాయా?
Justice PC Ghosh: కాళేశ్వరంపై నివేదిక సమర్పించిన జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక సమర్పించారు. నిబంధనల ఉల్లంఘన, ఆర్థిక అవకతవకలు సహా పలు అంశాలను ఇందులో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

Justice PC Ghosh submitted a report on Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కమిషన్ కు ప్రభుత్వం ఇచ్చిన గడువు చివరి రోజున నివేదిక సమర్పించిది. కేసీఆర్ సహా..కాళేశ్వరం ప్రాజెక్టులో పాలు పంచుకున్న కీలకమైన వ్యక్తులందరి వాంగ్మూలు తీసుకుని,రికార్డులు పరిశీలించి జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక సిద్ధం చేశారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం , ఇతర బ్యారేజీలలో సీపేజీ సమస్యలపై విజిలెన్స్ విచారణ జరిగింది. విజిలెన్స్ ప్రాథమిక నివేదికలో తీవ్రమైన నిర్మాణ లోపాలు గుర్తించారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించారు, దీని ఫలితంగా కమిషన్ ఏర్పాటైంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలు , సమస్యలపై విచారణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారత మొదటి లోక్‌పాల్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరిపింది. 115 మంది సాక్షులను విచారించి, వారి సాక్ష్యాలను నమోదు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 ఆఖర్లో కుంగడం, పియర్స్ దెబ్బతినడం, అన్నారం , సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్యలపై దృష్టి సారించింది. విజిలెన్స్ ,నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికలను పరిశీలించింది. క్రాస్-ఎగ్జామినేషన్ నిర్వహించింది. కమిషన్ గడువు చివరి రోజు అయిన జులై 31న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన విచారణ నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. రాహుల్ బొజ్జా ఈ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సమర్పించారు.
నివేదిక సమర్పణతో, ప్రభుత్వం దాని సిఫార్సులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నివేదికలో నిర్మాణ లోపాలు, బాధ్యులపై సిఫార్సులు ,సాంకేతిక సమస్యల పరిష్కార మార్గాలు ఉండవచ్చని భావిస్తున్నారు . కాళేశ్వరం అంశం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ మీద నేరుగా ఆరోపణలను కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మొత్తాన్ని కక్కిస్తామని.. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు. ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మొదట కేబినెట్లో ఆమోదించి.. ఆ తర్వాత .. కేసులు నమోదు చేయడం , దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ ప్రారంభించే అవకాశాలుఉన్నాయని అంచనా వేస్తున్నాయి.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పణతో అందులో ఏ విషయాలు ఉంటాయన్న దానిపై రాజకీయవర్గాల్లో ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. రాజకీయంగా సున్నితమైనది కావడంతో.. అంతటా ఆసక్తి వ్యక్తమవుతోంది.





















