Party Defections Petition: ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి: సుప్రీంకోర్టు ఆదేశాలు
Telangana Politics: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court verdict on BRS petition on party defections | న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్లపై కచ్చితంగా 3 నెలలకు మించకుండా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం తీర్పులో ఆదేశించింది. పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు కోర్టు వేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’ అనే తీరుగా వ్యవహరించడం సరికాదని పేర్కొంది. గతంలో అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్పీకరే మూడు నెలల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇవ్వడంతో ఈ అంశంపై ఉత్కంఠ వీడలేదు.
ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్ లో ఉంచుకోవడం సరికాదని... అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన తర్వాత స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంతో పాటు చర్యలు తీసుకోవాలని సూచించింది. పార్టీ ఫిరాయింపుల చట్టం పై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
సీజేఐ బీఆర్ గవాయ్ ఏమన్నారంటే..
ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు పార్టీల మార్పు ఎన్నో ఏళ్ల నుంచి చర్చకు వస్తోంది. దీన్ని నియంత్రించకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని, ప్రజల తీర్పునకు ప్రయోజనం ఉండదన్న వాదనలు ఉన్నాయి. ఎమ్మెల్యేల అనర్హతపై తీర్పును కోర్టులు ఆలస్యంగా ఇవ్వకూడదనే ఉద్దేశంతో స్పీకర్‌కు గతంలోనే అధికారాన్ని ఇచ్చారు. కనుక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో తీర్పు ఇవ్వలేమని, ఇది కోర్టు ముందున్న అంశమన్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 136, 226లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కిహోటో హొల్లోహన్ కేసును కూడా పరిశీలించాం, న్యాయపరమైన పునఃసమీక్ష పరిమితంగా ఉందని గుర్తుచేశారు.
ప్రజా ప్రతినిధుల పార్టీ మార్పు ప్రజాస్వామ్యానికి ముప్పు అని, వీటిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు, 2024 నవంబర్ 22న తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఎవరైనా ఎమ్మెల్యే ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడాన్ని ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తే.. వారు తన చర్యలను అడ్డుకుంటున్నారని స్పీకర్ పరిగణించాలని సుప్రీంకోర్టు సూచించింది.
బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకోవాలని పార్టీ వేసిన పిటిషన్లపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పులో ఆ అధికారం శాసనసభ స్పీకర్‌కు ఉందని.. 3 నెలల్లో చర్యలు ఆదేశించాలని ధర్మాసనం తీర్పు వెలువరించింది.






















