KCR Latest News: ఏపీ నిర్మించే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలి, జలదోపిడీ ఆగాలి- మరో ఉద్యమానికి కేసీఆర్ పిలుపు
Telangana News | ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం, సాగునీటి కోసం వినియోగించడం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

KCR about Banakacherla project | హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్ ను ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుని తీరతామని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ చేపట్టాల్సిన కార్యాచరణపై ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో కేసీఆర్ మంగళవారం నాడు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జి. జగదీశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రైతుల ప్రయోజనాలు గాలికొదిలేసిన ప్రభుత్వం
తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గం అన్నారు. తమను నమ్మిన ఓటు వేసిన పాపానికి తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత అన్యాయం చేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. చంద్రబాబు, ప్రధాని మోదీల ప్రయోజనాలు కాపాడేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తహతహ లాడుతున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం తరహాలో ఇతర విభాగాలను బలోపేతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలు, ఇతర అంశాలపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
తక్షణం గోదావరి జలాలు ఎత్తిపోయాలి..
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించకుండా, రైతులకు అన్యాయం చేస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వానాకాలం నాట్లు అయిపోతున్నా, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నా.. ఇప్పటివరకూ రైతులకు సాగునీరు అందించని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని దిశా నిర్దేశం చేశారు. తక్షణం కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. . పంపులను ఆన్ చేసి, నీళ్లు ఉన్న సమయంలోనే చెరువులు, రిజర్వాయర్లను ఎందుకు నింపడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణలో యూరియా కొరత..
రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు వరి నాట్లు వేసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఇది క్షమించరాని నేరం. రైతుల పక్షాన నిలిచి, వారి తరఫున బీఆర్ఎస్ పోరాటం మరింత ఉధృతం చేయాలి. కాంగ్రెస్, బీజేపీ దొందు దొందేనని.. పరస్పరం విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. రెండు పార్టీలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాక్షేత్రంలో గట్టిగా నిలదీయాలన్నారు. తెలంగాణ ప్రజలకు అండగా నిలిచేది, వారి కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని అన్ని వర్గా్ల్లో నమ్మకాన్ని పెంచాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం కొనసాగాలన్నా బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.






















