Telangana Congress: ఉత్తమ్ టైంకి రాలేదని అలిగిన కోమటిరెడ్డి - సాగర్ గేట్లు ఓపెన్ చేసే కార్యక్రమానికి డుమ్మా !
Telangana Ministers: ఉత్తమ్ ఆలస్యంగా వచ్చారని కోమటిరెడ్డి వెళ్లిపోయారు. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేందుకు వీరిద్దరూ వెళ్లాల్సి ఉంది.

KomatiReddy Vs Uttam Kumar Reddy: తెలంగాణ మంత్రుల మధ్య గంట సమయం చిచ్చు పెట్టింది. ఓ మంత్రి ఆలస్యంగా వచ్చారని మరో మంత్రి వెళ్లిపోయారు. ఈ ఘటన బేగంపేట ఎయిర్ పోర్టులో జరిగింది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. గేట్లు ఎత్తాల్సిన అవసరం పడింది. సాధారణంగా ఇలా ప్రాజెక్టుల గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని సంబరంగా నిర్వహిస్తారు. అధికారులు ఎత్తరు. ముఖ్యమంత్రి లేదా మంత్రులు హాజరవుతారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు నిండినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు గేట్లు ఓపెన్ చేశారు. నాగార్జున సాగర్ గేట్లను తెలంగాణ ప్రభుత్వం తరపు వారు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందుకు తెలంగాణ మంత్రులు రెడీ అయ్యారు.
షెడ్యూల్ కన్నా గంటన్నర ఆలస్యంగా వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు హెలికాఫ్టర్ బేగంపేట ఎయిర్ పోర్టులో రెడీగా ఉంది. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెలికాఫ్టర్ లో నాగార్జున సాగర్ వెళ్లి క్రస్ట్ గేట్లు ఎత్తాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ మరో మంత్రి ఉత్తమ్ కోసం ఎదురు చూశారు. 10 గంటల వరకు ఎయిర్ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు. తమను 9 గంటలకు రమ్మని 10 గంటల వరకు రాకపోవడం ఏంటని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనానికి గురయ్యారు. ఉత్తమ్ వచ్చిన తర్వాత సాగర్ వెళ్లి మళ్లీ తిరిగి వచ్చే సరికి చాలా సమయం పడుతుందని.. ముందుగా సమయం కేటాయించిన చాలా పనులు ఉన్నాయని చెప్పి కోమటిరెడ్డి వెళ్లిపోయారు.
వెయిట్ చేసి అసహనంతో వెళ్లిపోయిన కోమటిరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లిపోయిన కొంత సేపటి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. కోమటిరెడ్డి వెళ్లిపోయారని తెలుసుకుని ఫోన్ చేసి రావాల్సిందిగా కోరేందుకు ప్రయత్నించారు. కానీ కోమటిరెడ్డి అందుబాటులోకి రాలేదు. అప్పటికే నాగార్జున సాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఉన్న పళంగా గేట్లు ఎత్తకపోతే.. గేట్ల పై నుంచి నీరు దూకుతుందని అధికారులు సమాచారం ఇచ్చారు. దాంతో .. కోమటిరెడ్డి లేకుండానే హెలికాప్టర్ లో నాగార్జున సాగర్ వెళ్లిన ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
అప్పటికే సాగర్ నీరు.. గేట్ల పై నుంచి కిందకు వెళ్లడం ప్రారంభం అయింది. గేట్లు ఎత్తడం లేట్ అయినట్లయితే.. పై నుంచి నీళ్లు కిందకు వెళ్లిపోయేవి.





















