Meenakshi Natarajan Padayatra: తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర - కాంగ్రెస్ నేతలంతా కలసి వస్తారా?
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఫీల్డ్ లోకి వెళ్లాలని నిర్ణయించారు. నెలాఖరు నుంచి పాదయాత్ర చేయనున్నారు.

Congress in charge Meenakshi Natarajan padayatra in Telangana : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ జులై 31 నుండి తెలంగాణలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, ప్రజలతో సంబంధాలను బలపరచడం, ప్రభుత్వ విధానాలను ప్రచారం చేయడం కోసం అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వారం రోజుల షెడ్యూల్ ను ఖరారు చేశారు. రోజుకో నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 8 నుండి 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తారు. పూర్తి డీటైల్స్ ప్రకటించాల్సి ఉంది.
మీనాక్షి నటరాజన్ ఫిబ్రవరిలో తెలంగాణ ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. అంతకు ముందు వరకూ దీపాదాస్ మున్షి ఉండేవారు. మీనాక్షి నటరాజన్ ఎన్‌ఎస్‌యూఐ నుండి పార్టీలో ఎదిగారు. మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్‌లో కీలక నేతగా పని చేశారు. 2009లో మధ్యప్రదేశ్‌లోని మండ్సౌర్ నుండి ఎంపీగా గెలిచారు. రాహుల్ గాంధీకి అత్యంత ఇష్టమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రభుత్వం ఉన్న్పటికీ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం అంత చురుగ్గా లేదన్న అభిప్రాయంతో వారిని యాక్టివ్ చేసేందుకు మీనాక్షి నటరాజన్ ప్రయత్నిస్తున్నారు.
స్థానిక ఎన్నికలు కూడా రానున్న సమయంలో ప్రజల సమస్యలను నేరుగా వినడం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, వెనుకబడిన తరగతుల కుల గణన వంటి పథకాలను ప్రచారం చేయడానికిపాదయాత్ర అవసరమని నిర్ణయిానికి వచ్చారు. ఈ పాదయాత్రను అంతర్గత సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. పార్టీలోని సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం మెరుగుపరచడం , అసంతృప్త నాయకుల సమస్యలను పరిష్కరించడం వంటివి మీనాక్షి నటరాజన్ చేపట్టే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేసినప్పటికీ ఇంకా అనేక పథకాలు అమలు చేయాల్సి ఉందని.. అమలు చేసిన పథకాలు కూడా పూర్తిగా చేయలేదని విమర్శిస్తున్నారు. మొత్తం ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని.. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు సిద్ధంగా లేదని.. ఆ పార్టీ క్యాడర్ అసంతృప్తితో ఉందన్న ప్రచారం కారణంగా మీనాక్షి నటరాజన్ నేరుగా రంగంలోకి దిగుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా నామినేటెడ్ పోస్టుల విషయంలో న్యాయం జరగలేదని భావిస్తున్నారు. స్తానిక ఎన్నికలు నిర్వహించినా చాలా మందికి పదువులు దక్కి ఉండేవి. కానీ అవి ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నాయి. అదే సమయంలో పార్టీలో గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నాయి. అందర్నీ దారికి తెస్తే తప్ప స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించే అవకాశాలు ఉండవని అంచనాకు వస్తున్నారు. అందుకే దాదాపుగా ఆరు వందల కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి.. ప్రధాన నియోజకవర్గాలన్నింటినీ కవర్ చేయాలనుకుంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. మీనాక్షి నటరాజన్ తో పాటు పాదయాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.





















