BRS MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటలపాటు దీక్షకు రెడీ- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
BC Reservation Bill | బీసీ రిజర్వేషన్ల కోసం మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేపడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

Telangana Jagruti President Kavitha | హైదరాబాద్: బీసీ బిల్లు సాధన కోసం మూడు రోజులపాటు దీక్ష చేయడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారు. బీసీ బిల్లు ప్రాముఖ్యత చాటి చెప్పేందుకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటలపాటు దీక్ష చేపడతానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకుని నిరాహారదీక్ష చేస్తామన్నారు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహారదీక్షకు సిద్ధమని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటలు దీక్ష చేశాను. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తుచేసుకున్నారు.
ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లాలి..
హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి మనం ఎలాగైనా బీసీ బిల్లు సాధించుకోవాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న వారి అజెండా బీసీలకు రాజ్యాధికారం రావడం. బీసీ బిల్లు సాధనలో చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా కార్యక్రమంలో కేవలం బిహార్ అసెంబ్లీ ఎన్నికల స్టంట్ మాత్రమే. బీసీ బిల్లు విషయంలో కాంగ్రెస్ అసలు విషయాన్ని పక్కనపెట్టి, సాగదీత ధోరణిని పాటిస్తుంది.
తమిళనాడు కోర్టుకు వెళ్లి సాధించుకుంది..
బీసీలకు రిజర్వేషన్లపై బీజేపీ సైతం పోరాటం చేయడం లేదు. 2018 పంచాయతీ రాజ్ సవరణ చట్టాన్ని సవరణ చేస్తూ తెలంగాణ జాగృతి చేసిన డిమాండ్ తో తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసింది. ఇదే అంశంలో తమిళనాడులో గవర్నర్ జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి మరీ తీర్పు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ అంశంపై కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు. బీజేపీతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒప్పందంతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్లే యోచన చేస్తలేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటే తెలంగాణ ప్రభుత్వం మొదట సుప్రీంకోర్టులో కేసు వేయాలి.
పొన్నం వ్యాఖ్యలపై సెటైర్లు
గవర్నర్, రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే సానుకూల తీర్పు వచ్చింది. మేం ధర్నా చేస్తాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలిన మంత్రి పొన్న ప్రభాకర్ అంటున్నారు. అలా చేయడానికి ఇదేమైనా సత్రం భోజనమా...? తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారికంగా అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వారిపై ఉంది. కనీసం అఖిలపక్షం ఢిల్లీకి రావాలని రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అన్ని రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం లేఖలు రాయాలి.
మంత్రి పొన్నం ప్రభాకర్ భాద్యత లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం డ్రామా చేస్తోంది. నిజంగానే బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై కోర్టులో కేసు వేయాలి. బీసీ సీఎం అని బీజేపీ చెబుతోంది. ముందు వారికి బీసీలపై చిత్తశుద్ధి లేదు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా శూన్యం.






















