KTR Latest News: నిన్నైనా, రేపైనా బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ ఒక్కరే - కేటీఆర్
కాంగ్రెస్ బెదిరింపులతో పరిశ్రమలు తెలంగాణ వదిలి పారిపోయే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ అన్నారు.

పరకాల: గతంలో బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చేది కేసీఆర్ మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. Gift A Smile కార్యక్రమంలో భాగంగా పరకాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేటీఆర్ మహిళలకు కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీలతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సెట్ అవుతారని చెప్పారు.
కాంగ్రెస్ బెదిరింపులతో పరిశ్రమలు పారిపోయే పరిస్థితి
‘దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్ టైల్ పార్క్ లో 25000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కీటెక్స్ సంస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. వారు చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలన్న కాంగ్రెస్ బెదిరింపులతో పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి పారిపోయే పరిస్థితి దాపురించింది. కాకతీయ టెక్స్ టైల్ పార్కులో కాలువ నిర్మాణానికి జనవరిలో రూపొందించిన 137 కోట్ల అంచనాలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధనదాహంతో 297 కోట్లకు పెరిగింది. కాలువ నిర్మాణం పేరుతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు 167 కోట్లు దోచుకోవాలనుకున్నారు.
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు కు పరిశ్రమలను తెప్పించి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అనుకుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని నిలువు దోపిడి చేసే కుట్రలు చేస్తున్నారు. ప్రశ్నించకపోతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న దోపిడీ ఆగదని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వారి అక్రమాలపై నిలదీస్తాం’ అన్నారు కేటీఆర్.
కేటీఆర్ ఇంక ఏమన్నారంటే..
ప్రతీ ఆడబిడ్డకు తెలంగాణలోని ప్రభుత్వం 50 వేలు బాకీ ఉన్నది. చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్టు స్వయం సహాయక బృందాలకు 3000 కోట్ల రూపాయలకు బదులు రేవంత్ ప్రభుత్వం కేవలం 300 కోట్లు ఇచ్చి సంబరాలు చేసుకోవాలంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు సమ్మక్క- సారక్క, రాణి రుద్రమ వారసురాళ్లయిన వరంగల్ ఆడబిడ్డలు కర్రు కాల్చి వాత పెట్టాలి. మొన్న పార్లమెంటు ఎన్నికలప్పుడు రైతుబంధువేసి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయని మళ్లీ రైతుబంధు వేశారు.
Live: BRS Working President @KTRBRS distributing Sewing Machines and KCR Kits as part of Gift A Smile program.
— BRS Party (@BRSparty) July 27, 2025
📍 Parkal, Warangal
https://t.co/7bbkCQ0o0K
స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ కండువా కప్పుకుని మీ ఇంటికి వచ్చే బీఆర్ఎస్ క్యాడర్ ను కేసీఆరే వచ్చిండని భావించి కడుపులో పెట్టుకొని ఆశీర్వదించండి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం జనవరిలోనే ఎరువులు కొని బఫర్ స్టాక్ చేసుకునేది. అందుకే ఆయన సిఎంగా ఉన్నన్ని రోజులు యూరియా దుకాణాల ముందు లైన్లో చెప్పులు, ఆధార్ కార్డులు కనిపించలేదు. టైంకి ఎరువులు, విత్తనాలు, యూరియా ఇవ్వలేని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదు.
లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం..
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్ రెడ్డి ప్రగల్బాలు పలుకుతున్నాడు. పరకాల నియోజకవర్గంలో ఇండ్లు నిర్మించుకున్న 3 వేల మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సతాయిస్తున్నది. లబ్ధిదారుల తరపున పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కోర్టుకు పోతే, న్యాయస్థానం చెప్పినా కూడా రేవంత్ ప్రభుత్వం స్పందించడం లేదు. 3000 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగేదాకా పోరాడుదాం. అసెంబ్లీలో కొట్లాడుతాం.
తెలంగాణ షాన్ గా ఉన్న ఆజం జాహీ మిల్లు సమైక్య పాలనలో మూతపడింది. నాటి సమైక్య పాలకులు ఆజం జాహి మిల్లు భూములను అడ్డుకి పావు సేరు అమ్ముకున్నారు. ఆజం జాహి మిల్లు మూతపడడంతో వరంగల్ జిల్లాలోని పద్మశాలీలు బతుకుదెరువు కోసం భీమండి, సూరత్, షోలాపూర్, వలస పోయారు. అలా వలస పోయిన వాళ్లందర్నీ స్వరాష్ట్రంలో తిరిగి వెనక్కి తెప్పించుకుంటామని ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు చెప్పారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ వచ్చాక ఇదే వరంగల్ గడ్డపై 1500 ఎకరాల్లో భారత దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు.
కేసీఆర్ హయాంలో కార్మికుల కోసం షెడ్లు
బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ది, పట్టుదల, నిజాయితీ కారణంగా కేరళకు చెందిన కీటెక్స్ సంస్థ 2400 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. దాంతో పాటు యంగ్ వన్ అనే కొరియా సంస్థ, గణేష్ ఎకో అనే బొంబాయి సంస్థ కూడా పెట్టుబడులు పెట్టడంతో 2022- 23 నాటికి ఒక టెక్స్ టైల్ పార్క్ లో ఒక యూనిట్ ను ప్రారంభించాం. శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలకు కాకతీయ టెక్స్ టైల్ పార్కులో ఉద్యోగాలు వచ్చే బాధ్యత తీసుకుంటాము. శ్రామికులుగా సూరత్ కు వలస పోయిన కార్మికులను తిరిగి పారిశ్రామికులుగా తెలంగాణకు రప్పించేందుకు కేసిఆర్ సీఎంగా ఉన్నప్పుడు మడికొండలో 100 ఎకరాల్లో ఏర్పాటుచేసిన షెడ్లు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో నిరుపయోగంగా మారాయని’ కేటీఆర్ ఆరోపించారు.






















