Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్- తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
Amrit Bharat Express: చర్లపల్లి- తిరువనంతపురం మధ్య అమృత్ భారత రైలును శుక్రవారం ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ప్రతి మంగళవారం ఈ ట్రైన్ నడవనుంది.

Amrit Bharat Express: భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మారుస్తూ సామాన్య ప్రయాణికులకు కూడా వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని చేరువ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా కేరళ రాజధానికి అనుసంధానిస్తూ సరికొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ శివారల్లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి తిరువనంతపురం నార్త్ (కోచువేలి) మధ్య నడవనున్న ఈ వీక్లీ సర్వీస్ దక్షిణ భారత దేశంలోని నాలుగు రాష్ట్రాలను కలిపే ఒక వారధిగా నిలవనుంది.
ప్రధాని చేతుల మీదుగా చర్లపల్లి- తిరువనంతపురం అమృత్ భారత్ రైలు ప్రారంభం
జనవరి 23న ఈ వీక్లీ రైలును ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. కేరళలోని తిరువనంతపురంలోని పుత్తరికాండం మైదానం వేదికగా ఉదయం 10.45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం రోజున 06308 అనే ప్రత్యేక నెంబర్‌తో ఇనాగురల్ సర్వీస్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టనుంది. ఈ వేదికపై నుంచే మూడు అమృత్ భారత్ రైళ్లను ఒకేసారి ప్రారంభించనున్నారు.
అమృత్ భారత్ రైలు అత్యాధునిక పుష్‌పుల్ సాంకేతికతతో నడుస్తుంది. ఇది వేగవంతమైన ప్రయాణానికి తోడ్పడుతుంది. ఈ రైలులో 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు సామాన్య ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల ఆకలి తీర్చేందుకు ఒక ప్యాంట్రీ కార్ ఉంటుంది. ముఖ్యంగా దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా రూపొందించిన దివ్యాంగ్జన్ ఫ్రెండ్లీ కోచ్‌లు ప్రత్యేకం.
ప్రయాణం మార్గం- తెలుగు రాష్ట్రాలతోపాటు ఆగే స్టేషన్లు ఇవే
చర్లపల్లి నుంచి తిరువనంతపురం మధ్య సుమారు 1488 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 31 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కీలక స్టేషన్‌లలో ఆగనుంది. తెలంగాణలో చర్లపల్లిలో బయల్దేరి నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్‌లలో ఈ ట్రైన్ ఆగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు,రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. తమిళనాడులోని సేలం, ఈరోడ్, కోయంబత్తూరు మీదుగా కేరళలోని పాలక్కాడా, త్రిసూర్, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, కొల్లం, వర్కల స్టేషన్‌లలో ఆగుతూ గమ్య స్థానానికి చేరుకుంటుంది. మొత్తం మీద 29 స్టేషన్‌లలో ఈ రైలు ఆగుతుంది.
ఈ రైలు ప్రారంభం కావడంతో కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే భక్తులకు గొప్ప వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా శబరిమల యాత్రికులకు గురువాయర్ దర్శనానికి వెళ్లే భక్తులకు, తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామిని చూడాలనుకునే భక్తులకు ఇది వరంగా మారనుంది. చర్లపల్లి నుంచి ఇప్పటికే ముజఫర్‌పూర్ వరకు అమృత్ భారత్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఇప్పుడు దక్షిణ భారతాన్ని కలిపే మరో సర్వీస్ వచ్చింది.
ఈ రైలు వారానికి ఒకరోజు మాత్రమే నడుస్తుంది. సాధారణంగా షెడ్యూల్ ప్రకారం ఇది ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. ప్రతి బుధవారం తిరువనంతపురం నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.





















