Amrit Bharat Station Yojana: రూ.14.5 కోట్లతో ఏపీలో సరికొత్త రైల్వే స్టేషన్.. ప్రధాని మోదీ చేతుల మీదుగా రేపే ప్రారంభం
Sullurupeta railway station | అమృత్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. 14.5 కోట్లతో డెవలప్ చేసిన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను మోదీ ప్రారంభించనున్నారు.

ఇండియన్ రైల్వే స్టేషన్ లు అంటే అంత నీట్ గా ఉండవు అనేది గతం. అమృత్ భారత్ పథకం (Amrit Bharat Station Yojana) కింద ఇప్పుడు దేశంలోని చాలా స్టేషన్లను పూర్తిస్థాయిలో డెవలప్ చేస్తోంది రైల్వే శాఖ. వాటిలో చాలావరకు నిర్మాణ దశలో ఉండగా ఏపీలోని "సూళ్లూరుపేట " (Sullurupeta railway station) కంప్లీట్ గా న్యూ లుక్ లో రెడీ అయిపోయింది. రేపు అంటే మే 22 న ప్రధాని మోదీ చేతుల మీదుగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ప్రారంభం కాబోతుంది. అమృత్ పథకం లో భాగంగా తొలిసారి ప్రారంభం కాబోతున్న స్టేషన్గా " సూళ్లూరుపేట " ఏపీలో చరిత్ర సృష్టించడానికి రెడీ అయిపోయింది.
" సూళ్లూరు పేట " స్టేషనే ఎందుకంటే..
సూళ్లూరుపేట ఏపీ, తమిళనాడు బోర్డర్లో ఉన్న పెద్ద టౌన్. ఇక్కడికి తమిళనాడు బోర్డర్ కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే. ఈ స్టేషన్ దాటాక అక్కంపేట, తడ స్టేషన్లు దాటితే చాలు తమిళనాడులోకి ఎంటర్ అయిపోతాం. ఈ స్టేషన్ గుండా 42 ఎక్స్ ప్రెస్ రైళ్లు, 28 EMU ట్రైన్స్ ప్రయాణం చేస్తుంటాయి. "సూళ్లూరుపేట" ను NSG-5 (నాన్ సబర్బన్ గ్రూపు) కేటగిరీ లో ఉంచింది ఇండియన్ రైల్వే. అంటే రోజుకి కనీసం 9,000 మందికి పైగా ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి జర్నీ చేయాల్సి ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ISRO ఇక్కడికి జస్ట్ 18 కిలోమీటర్లు. అలాగే ప్రాచీన చెంగాలమ్మ ఆలయం ఈ ఊర్లోనే ఉంది. ప్రతి శాటిలైట్ ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు చెంగాలమ్మ ఆలయాన్ని సందర్శించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.

నేలపట్టు పక్షుల అభయారణ్యం, పులికాట్ సరస్సు ఇక్కడికి అతి సమీపంలో ఉన్నాయి. ఇలా "సూళ్లూరుపేట " ఏ విధంగా చూసినా ఏపీ లో ముఖ్యమైన టౌన్ గా ఉంటూ వస్తోంది. ఇవన్నీ గమనించి ఈ స్టేషన్ను డెవలప్ చేయడానికి 14.5 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్రం. ఆ నిధులతో కనీ విని ఎరుగని స్థాయిలో సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ను రెడీ చేశారు అధికారులు.
స్టేషన్ ప్రత్యేకతలు ఇవే..
సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ను ప్రస్తుతం ఎవరైనా తెలియని వాళ్ళు బయటినుంచి చూస్తే ఒక చిన్న సైజు ఎయిర్పోర్టు లాగా కనిపిస్తుంది. పూర్తిగా ట్రెడిషనల్ లుక్ ఉట్టిపడేలాగా స్టేషన్కు ఎలివేషన్ ఇచ్చారు. అలాగే హైటెక్ రిజర్వేషన్ కౌంటర్, లైట్లతో వెలిగిపోయేలా సీలింగ్ , అధునాతన సీటింగ్ సౌకర్యం, ప్లాట్ ఫామ్ ల మధ్య మారడానికి రెండేసి లిఫ్ట్లు, క్రొత్త ప్లాట్ ఫామ్ లు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండేలా స్టేషన్ ను డిజైన్ చేసారు. ఎక్కడికి అక్కడ వాటర్ ఫెసిలిటీ తో పాటు భవిష్యత్తు అవసరాలకు పనికొచ్చేలా కంప్లీట్ గా న్యూ లుక్ లో రైల్వే స్టేషన్ రెడీ చేసినట్టు చెన్నైకు చెందిన గతి శక్తి అధికారి డిప్యుటీ చీఫ్ ఇంజనీర్ వెంకటేశన్, చెన్నై డివిజన్ PRO ఏలుమలై తెలిపారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా రేపే ప్రారంభం
పూర్తిగా న్యూ లుక్ లోకి మారిపోయిన " సూళ్లూరుపేట " రైల్వే స్టేషన్ ను రేపు ప్రధాన మోడీ స్వయంగా ప్రారంభించనున్నారు. దీనితోపాటు దేశవ్యాప్తంగా వందకు పైగా స్టేషన్లను ఆయన వర్చువల్ పద్ధతిలో దేశానికి అంకితం చేస్తారు. ఏపీలో నిర్మాణంలో ఉన్న మిగిలిన అన్ని అమృత్ భారత్ స్టేషన్ లకు ఒక రోల్ మోడల్ గా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ రెడీ అయ్యింది అని స్థానికులు సంబరపడుతున్నారు.





















