Dharmapuri Election Issue : ధర్మపురి ఎన్నికల వివాదం, స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్సింగ్ పై రంగంలోకి ఈసీ!
Dharmapuri Election Issue : ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూం తాళాలు దొరక్కపోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారు రేపు విచారణ చేపట్టనున్నారు.
Dharmapuri Election Issue : జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూం తాళం చెవి మిస్ అవ్వడంపై కొండగట్టు జేఎన్టీయూలో రేపు(సోమవారం) ఈసీ విచారణ చేపట్టనుంది. హైకోర్టు ఆదేశాలతో ఈసీ అధికారులు విచారణ జరపనున్నారు. దిల్లీ నుంచి వచ్చిన ఈసీ అధికారులు... 2018లో ధర్మపురి ఎన్నికల్లో పనిచేసిన అధికారులను విచారించనున్నారు. విచారణకు హాజరుకావాలని ఈసీ ఇప్పటికే అప్పటి ఎన్నికల అధికారులకు నోటీసులు ఇచ్చింది.
ఈసీ అధికారులు రంగంలోకి
2018 ధర్మపురి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు... స్ట్రాంగ్ రూమ్ తెరవాలని అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 10న ధర్మపురి నియోజకవర్గ ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్‌రూమ్ ను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా సమక్షంలో తెరిచేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు కనిపించకపోసేసరికి ఈ ప్రక్రియను నిలిపివేశారు. మూడు గదుల్లో రెండు గదుల తాళాలు మిస్ అవ్వడంతో కీ రిపేర్లు చేసే వ్యక్తిని పిలిపించడం లేదా పగలగొట్టాలని అధికారులు భావించారు. అయితే అందుకు కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఒప్పుకోలేదు. దీంతో తెరిచిన గదితో పాటు మిగతా రెండింటిని అధికారులు సీల్ వేశారు. తెరిచిన స్ట్రాంగ్ రూంలలో 108 నుంచి 269 పోలింగ్ కేంద్రాల ఓటింగ్ యంత్రాలు భద్రంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రెండు గదుల తాళాలు తెరచుకోలేదని జిల్లా కలెక్టర్ కోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈసీ సూచన మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రేపు విచారణ చేపట్టనున్నారు.
అసలేంటి వివాదం?
2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుండి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేశారు. ఈయనకు పోటీగా కాంగ్రెస్ నుండి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బరిలో దిగారు. నువ్వానేనా అన్నట్టుగా జరిగిన ఆ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో కొప్పుల ఈశ్వర్ విజయం సాధించినట్లు ఓట్ల లెక్కింపు తర్వాత అధికారులు ప్రకటించారు. అయితే, సరిగ్గా లెక్కించకుండా గెలిచినట్లు ప్రకటించారని కాంగ్రెస్ నేతలు అప్పట్లో హడావుడి చేశారు. రెండో స్థానంలో నిలిచిన లక్ష్మణ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనిపై న్యాయస్థానం సైతం ఆశ్రయిస్తామని అప్పట్లోనే ప్రకటించారు. సీనియర్ నేతగా పేరు ఉన్న కొప్పుల ఈశ్వర్ ఓటమి భయంతోనే గెలుపు కోసం అడ్డదారులు తొక్కారని అడ్లూరు లక్ష్మణ్ ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరగడంతో అనేక ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల్లో పోటీ పడ్డారని, అయినప్పటికీ చివరి నిమిషంలో ఓడిపోతారని భయంతో అధికారుల అండ చూసుకుని తప్పుడు మార్గంలో గెలిచారని ఆరోపించారు. ఇంత చేసినప్పటికీ కేవలం 441 ఓట్ల మెజారిటీ మాత్రమే లభించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే వీవీ ప్యాట్ల ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించక ముందే అధికారులు కొప్పుల ఈశ్వర్ పేరు ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది.