IIT Hyderabad AI driverless buses: హైదరాబాద్‌లో డ్రైవర్ లెస్ బస్సులు - ఇప్పటికే పదివేల మంది ప్రయాణించారు కూడా - ఎక్కడో తెలుసా ?
Driverless buses: మన దేశంలో డ్రైవర్ లెస్ వాహనాలు లేవని అనుకుంటారు. కానీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి.

IIT Hyderabad AI driverless buses ferry 10 000 passengers : డ్రైవర్ లెస్ బస్సులు, కార్లు ఇంకా ఇండియాలోకి అడుగు పెట్టలేదనుకుంటాం. కానీ ఇక్కడే రెడీ అవుతున్నాయి. అదీ కూడా మన హైదరాబాద్‌లో. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్‌లోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ ఆటోనమస్ నావిగేషన్ (TiHAN) ఈ AI ఆధారిత డ్రైవర్‌లెస్ బస్సులను అభివృద్ధి చేసింది. ఈ బస్సులు ఆగస్టు 2023లోనే లాంచ్ చేశారు. ఇప్పటికే క్యాంపస్‌లో రోజువారీ సేవలు అందిస్తున్నాయి.
ఈ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రైవర్ లేకుండా నడుస్తాయి. రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సులు ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC) సిస్టమ్‌లతో నడుస్తున్నాయి. ఇవి అడ్డంకులను గుర్తించడం, సురక్షిత దూరాన్ని నిర్వహించడం , వేగాన్ని సర్దుబాటు చేయడంలో సహాయపడతాయి.
LiDAR-ఆధారిత నావిగేషన్ సిస్టమ్,ఇతర సెన్సార్‌లను ఉపయోగించి, ఈ బస్సులు క్యాంపస్ లోపల విద్యార్థులు, ఫ్యాకల్టీని సురక్షితంగా రవాణా చేస్తున్నాయి. ఈ బస్సులు లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే 10,000 మంది ప్రయాణికులను రవాణా చేశాయి. 90 శాతం సంతృప్తి రేటింగ్‌తో సానుకూల స్పందనను పొందాయి. ఈ డ్రైవర్ లెస్ బస్సుల షటిల్ సర్వీస్ రోజుకు ఆరు సార్లు నడుస్తుంది. ఉదయం మూడు సార్లు, మధ్యాహ్నం మూడు సార్లు, క్యాంపస్ లోపల విద్యార్థులు , సిబ్బందిని డ్రాప్ చేస్తుంది.
ఈ రెండు బస్సులు ఇప్పటికే 15,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి, ఇది వాటి విశ్వసనీయతను సూచిస్తుంది. ఈ ప్రాజెక్టు టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ 9 (TRL-9) సాధించింది, అంటే ఇది నిజ-ప్రపంచ పరిస్థితుల్లో పరీక్షలు విజయంతంగా పూర్తి చేసింది.
TiHAN భారతదేశంలో మొట్టమొదటి ఆటోనమస్ నావిగేషన్ టెస్ట్‌బెడ్‌ను స్థాపించింది, ఇది భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా ఆటోనమస్ టెక్నాలజీని పరీక్షించడానికి , ధృవీకరించడానికి ఉపయోగపడుతుంది. ‘సఫారీ’ అనే ప్రాజెక్టులో భాగంగా, హైదరాబాద్ నుంచి జమ్మూ వరకు సుమారు 8,000 కిలోమీటర్లు ప్రయాణించిన ఒక SUV ద్వారా రోడ్లు, ట్రాఫిక్ నమూనాలు, వాతావరణ పరిస్థితులపై డేటాను సేకరించారు. ఈ ప్రాజెక్టును ప్రొఫెసర్ పి. రాజలక్ష్మి నేతృత్వం వహిస్తున్నారు, ఆమె 100 మంది ఇంజనీర్ల బృందాన్ని నడిపిస్తూ ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టు మహిళల నాయకత్వంలో ఆటోమోటివ్ రంగంలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణగా గుర్తింపు పొందింది.
ప్రస్తుతం ఈ బస్సులు క్యాంపస్ పరిధిలో మాత్రమే నడుస్తున్నాయి, కానీ విమానాశ్రయాలు, పెద్ద విద్యా సంస్థలు, పరిశ్రమల సైట్‌ల వంటి నియంత్రిత వాతావరణాల్లో ఈ బస్సులను ఉపయోగించే అవకాశాలను అన్వేషిస్తున్నారు. భారత రోడ్ల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేయడానికి TiHAN డేటా సేకరణ, పరీక్షలను కొనసాగిస్తోంది.





















