అరెస్టు చేయొద్దని చెప్పలేం- అవినాష్ రెడ్డి పిటిషన్ తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు
వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.
వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది.
దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి అనుమతి ఇచ్చిన కోర్టు... విచారణన ఆడియో వీడియో రికార్డు చేయాలని ఆదేశించింది. అవినాష్ న్యాయవాదిని లోపలికి అనుంతి వీలు కాదని చెప్పిన కోర్టు... వాళ్లకు కనిపించేలా ప్రశ్నించాలని సూచించింది.
ఈ కేసు విచారణలో భాగంగా అవినాష్ విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సీబీఐ అందించింది. 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, కొన్ని ఫొటోలను కోర్టుకు సమర్పించింది. అవినాష్ విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేస్తున్నట్లు కోర్టు దృష్టికి సీబీఐ తీసుకొచ్చింది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లెటర్, ఎఫ్‌ఎస్ఎల్ నివేదికను కూడా హైకోర్టుకు సీబీఐ అందజేసింది. 160 సీర్పీసీలో విచారిస్తున్నామని...కోర్టు ద్వారా విచారణకు రాలేదని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నోటీసులతో వచ్చారని సీబీఐ వెల్లడించింది. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంలో అవినాష్ పాత్ర ఉందని.. ఆయనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇవ్వొద్దని హైకోర్టును కోరింది.
వివేకా కుమార్తె వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పైనే అవినాష్ రెడ్డి అభ్యంతరం
ఈ కేసులో తన వాదనలు వినాలని వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సునీత పిటిషన్ వెనుక సీబీఐ హస్తం ఉందని అవినాష్ రెడ్డి న్యాయవాది వాదించారు. సునిత అభియోగాల వెనకాల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. వివేక హత్య అనంతరం అనుకూలంగా ఉన్న సునీత ఏడాది తరువాత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేకా రెండో భార్య షమీంల పాత్రపై సీబీఐ విచారణ చేయడం లేదని తెలిపారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని దర్యాప్తు జరగాలని అవినాష్ తరుపు న్యాయవాది కోరారు.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్న సీబీఐ
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటి వరకూ రిమాండ్ రిపోర్టులు, కౌంటర్ల ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం అవినాష్ రెడ్డి ప్రధాన అనుమానితుడిగా ఉన్నారు. అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రిని కూడా అదుపులోకి తీసుకోవాలని గతంలోనే నిర్ణయించుకున్నామని నేరుగా హైకోర్టుకే సీబీఐ చెప్పింది.
ఇప్పుడు హైకోర్టు కూడా దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఇప్పుడు సీబీఐ ఏం చేయబోతుంది... అవినాష్ రెడ్డి నెక్ట్స్ మూవ్ ఎలా ఉంటుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.