Vikarabad News: బండి సంజయ్ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు - గొడవకు దిగిన బీజేపీ నాయకులు
Vikarabad News: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్ ను వికారాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Vikarabad News: వికారాబాద్ మన్నెగూడ సమీపంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై బీజేపీ నాయకుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అడ్డుకున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారులతో పోలీసుల మంతనాలు జరిపారు. కాసేపటి తర్వాత పోలీసులు బండి సంజయ్ కాన్వాయ్ నుంచి అడ్డుతప్పుకున్నారు. దీంతో బండి సంజయ్ వికారాబాద్ వైపుగా వెళ్తున్నారు. మరి కాసేపట్లో తాండూరు చేరుకుని గాయపడ్డ బీజేపీ నేత మురళీగౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
వారం రోజుల క్రితమే పరిగి నియోజకవర్గంలో బండి సంజయ్ సభ
రాష్ట్రంలో బీఆర్ఎస్ ను వణికించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉద్యోగులకు జీతాలే సక్రమంగా ఇవ్వలేనివాళ్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలెలా అమలు చేస్తారని ప్రశ్నించారు. 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచిన కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే మరో రూ.5 లక్షల అప్పు చేసి ప్రజల చేతికి చిప్ప ఇస్తారని మండిపడ్డారు. పంచాయతీలకు నిధులివ్వకుండా, ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ లో చేరితేనే ప్రజా ప్రతినిధులకు నిధులిస్తామని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీ తరతమ బేధం లేకుండా తెలంగాణలోని పంచాయతీలన్నింటికీ నిధులు కేటాయిస్తున్నారన్నారు. బీజేపీలోనే చేరితేనే నిధులిస్తామని మోదీ ఆఫర్ ఇస్తే బీఆర్ఎస్ లో ఒక్కరైనా మిగిలేవారా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.
దిల్లీ దోస్త్ కొండ పోచమ్మ సాగర్ పర్యటన
‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని రూప్ ఖాన్ పేటలో జరిగిన సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ... "కేసీఆర్ ఇయాళ జల్దీ లేచిండట. వాళ్ల దోస్త్ పంజాబ్ సీఎం వచ్చిండు. ఆయనను కొండ పోచమ్మ సాగర్ పంపి చాలా బాగుందని అనిపించారు. కొండ పోచమ్మ సాగర్ కోసం ఎంతోమంది త్యాగం చేసి జాగాలిచ్చారు. ఆ పక్కనే మల్లన్న సాగర్ లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాలేదని రైతులు ధర్నాలు చేశారు. ఒక రైతు అయితే ఆయన చితి ఆయనే పేర్చుకుని ఆహుతైపోయారు. అయినా సిగ్గు లేదు." అన్నారు.