Vande Bharat Express: సికింద్రాబాద్ -నాగ్ పూర్ మధ్య వందే భారత్ రైలు, త్వరలోనే అందుబాటులోకి!
Vande Bharat Express: సికింద్రాబాద్-నాగ్ పూర్ మధ్య వందేభారత్ రైలును నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
Vande Bharat Express: సికింద్రాబాద్-నాగ్ పూర్ మధ్య త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా... ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి మధ్య సేవలు అందిస్తున్నాయి. విశాఖ- సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్‌కు ఆదివారం సెలవు అయితే... తిరుపతి- సికింద్రాబాద్ మధ్య నడిచే ట్రైన్‌కు మంగళవారం సెలవు దినంగా ప్రకటించారు. ఇవి సెలవు రోజు తప్పు వారం పొడవునా 100 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ రేటుతో నడుస్తున్నాయి. డిమాండ్ కారణంగా ఈ రైళ్లలో రిజర్వేషన్లు నిండిపోతున్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రెండు సర్వీసులు విజయవంతం కావడంతో వచ్చే కొద్ది నెలల్లో సికింద్రాబాద్ నాగ్ పూర్ మధ్య వందే భారత్ రైలును ప్రవేశ పెట్టాలని భారతీయ రైల్వే అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. భారతీయ రైల్వే ఎస్సీఆర్ అధికారులతో కలిసి ఈ సేవలను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ - నాగ్ పూర్ మధ్య 25 రైళ్లు
హైదరాబాద్ - నాగ్ పూర్ మధ్య ఇప్పటికే దాదాపుగా 25 రైళ్లు నడుస్తున్నాయి. రెండు నగరాలు వాణిజ్య, వ్యాపార కేంద్రాలు. అయితే అన్నీ ఎక్స్ ప్రెస్ రైళ్లు, సూపర్ ఫాస్ట్ రైళ్లు కాదు. రెండు నగరాల మధ్య చాలా వాణిజ్యం జరుగుతుంది. సాధారణ ప్యాసింజర్ రైళ్ల ప్రయాణ సమయం సుమారు 10 గంటలు. అదే వందే భారత్ రైలు ఆ ప్రయాణ సమయాన్ని 6.30 గంటలకు తగ్గించవచ్చని అధికారులు యోచిస్తున్నారు. సికింద్రాబాద్ - నాగ్ పూర్ మధ్య దూరం దాదాపు 581 కిలో మీటర్లు. సాధారణంగా ఈ దూరాన్ని అధిగమించడానికి 10 గంటలు పడుతోంది. భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశ పెట్టడం ద్వారా సమయాన్ని 10 గంటల నుంచి 6.30 గంటలకు తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్ నగర్, బలార్షా, మీదుగా ఈ రైలును నడపాలని ప్లాన్ చేస్తున్నారట. వందే భారత్ రైలు ఉదయం ఆరు గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకొని తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 8 గంటలకు నాగ్ పూర్ చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.
భారీ కేటాయింపులు..
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) స్లీపర్ వెర్షన్ కోసం రైల్వే బడ్జెట్ నుంచి రూ. 1800 కోట్ల కేటాయింపులకు ఆమోదించారు. వచ్చే రెండేళ్లలో, దేశంలోని వివిధ మార్గాల్లో ఈ వెర్షన్‌కు చెందిన 400 రైళ్లను పట్టాల పైకి తీసుకు రానున్నారు. ఈ రైళ్లను తయారు చేసేందుకు ఐసీఎఫ్ తోపాటు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. IANS (Indo Asian News Service) వార్తల ప్రకారం.. 400 రైళ్లలో, మొదటి 200 చైర్ కార్ రైళ్లు, మిగిలినవి స్లీపర్ వెర్షన్. చైర్ కార్ రైళ్లు గరిష్టంగా 180 కి.మీ. వేగంతో నడిచేలా డిజైన్ చేస్తారని, కానీ 130 కి.మీ. వేగంతో నడుపుతారని తెలుస్తోంది.