(Source: ECI/ABP News/ABP Majha)
TSRTC News: ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై - సీసీటీవీ కెమెరాలు, అబ్బో ఈ కొత్త బస్సుల్లో ఎన్ని సౌకర్యాలో!
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ బస్టాప్ వద్ద ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ ఈ కొత్త బస్సులను ప్రారంభించనున్నారు.
తెలంగాణలో ఆర్టీసీ కష్టాల నుండి గట్టెక్కి అభివృద్ది బాట పట్టేందుకు వేగంగా అడుగులేస్తోంది. ఇటీవల యాభైకిపైగా కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన ఆర్టీసి, ఈ రోజు మరో కొత్తరకం స్లీపర్ బస్సులను రోడ్డెక్కించనుంది. ప్రయాణీకుల సౌకర్యార్థం రాష్ట్రంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. మొదటగా 4 స్లీపర్, మరో 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులను ప్రారంభించబోతుంది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా అత్యాధునిక హంగులతో రూపొందించిన ఈ బస్సులు నేటి నుండి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్-కాకినాడ, హైదరాబాద్-విజయవాడ మార్గాల్లో అద్దె ప్రతిపాదికన ఈ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడిపేందుకు సర్వం సిద్దమైంది. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ బస్టాప్ వద్ద ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో సంస్థ చైర్మన్, బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యే, ఎండీ వీసీ సజ్జనార్, అడిషనల్ డీజీపీ ఈ కొత్త బస్సులను ప్రారంభించనున్నారు. ప్రారంభించిన వెంటనే బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ రోజు నుండే విజయవాడ, కాకినాడ ఇలా ప్రధాన మార్గాల్లో కొత్త బస్సులు ప్రయాణికులకు సేవలందించనున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుండి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. బస్సులు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రోడ్డెక్కుతున్న సూపర్ లగ్జరీ, స్లీపర్ బస్సులు ప్రయాణికులు కష్టాలు తీర్చడంతోపాటు నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కాస్త ఊరట ఇవ్వనున్నాయి.
స్లీపర్ బస్సు ప్రత్యేకతలు
స్లీపర్ బస్సుల్లో లోయర్ బెర్తులు 15, అప్పర్ బెర్తులు 15 ఉంటాయి. ప్రతి బెర్త్ వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. సీటర్ కమ్ స్లీపర్ బస్సుల్లో 15 అప్పర్ బెర్తులతో పాటు లోయర్ లెవల్‌లో 33 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ప్రతి బస్సుకు ఎయిర్ సస్పెన్షన్ సదుపాయం కల్పించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రతి బస్సులోనూ వైఫై సదుపాయాన్ని కల్పించారు. ఈ బస్సుల్లో ప్రయాణించే వారికి ఒక వాటర్ బాటిల్‌తో పాటు ఫ్రెషనర్‌ను ఉచితంగా అందజేస్తారు. తమ లగేజీ లోడింగ్, అన్‌లోడింగ్‌కు అటెండెంట్లు సహకరిస్తారు. బస్సుకు ముందు వెనక ఎల్‌ఈడీ బోర్డులుండటంతోపాటు. గమ్యస్థానాల వివరాలు తెలుగు, ఇంగ్లీషు భాషలో అందులో కనిపించడం ఈ స్లీపర్ బస్సులకు మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫ్రంట్ రోడ్ వ్యూ, ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రాంతం, బస్సు లోపలి ప్రాంతంలో ఈ కెమెరాలుంటాయి. ప్రయాణికులు బస్సు ఎక్కే సమయంలో, బస్సు నుండి దిగుతున్న సమయంలో డ్రైవర్ జాగ్రత్తగా గమనించి బస్సు నడిపేందుకు ఈ సీసీ కెమెరాలు సహకరించనున్నాయి. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా మరొక కెమెరా ఉంటుంది. అంతేకాదు, అగ్నిప్రమాదాలను నివారించేందుకు అగ్నిమాపక పరికరాలు ప్రతీ బస్సులో అందుబాటులో ఉంచారు.
ప్రయాణికులు సౌకర్యవంతంగా బస్సులో ప్రయాణించేందుకు విశాలంగా బెర్త్‌లను ఏర్పాటు చేశారు. బెర్త్ ఏర్పాటు విషయంలో తోటి ప్రయాణికుల బెర్త్ లు ప్రక్క ప్రక్కనే ఉన్నప్పటికీ ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈ కొత్త స్లీపర్ బస్సులలో బెర్త్ ల ఏర్పాటు తయారీ సమయంలోనే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
బస్సుల వేళలు ఎలా ఉండబోతున్నాయంటే..?
కాకినాడ వైపు వెళ్లే బస్సులు హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. ప్రతి రోజు రాత్రి 07.45, 8.30 గంటలకు నడుస్తాయి. కాకినాడ నుంచి తిరిగి రాత్రి 07.15, 07.45 గంటలకు హైదరాబాద్‌కు ప్రారంభమవుతాయి. విజయవాడ వైపునకు వెళ్లే బస్సులు ప్రతి రోజు మియాపూర్ నుంచి ఉదయం 9.30, 10.45, 11.45, రాత్రి 9.30 , 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడ నుండి తిరిగి హైదరాబాద్‌కు ఉదయం 10.15, 11.15 మధ్యాహ్నం 12.15 గంటలకు అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు ప్రారంభం అవుతాయి.