Telangana Assembly Monsoon Session :తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం- గట్టి ప్లాన్‌తోనే సభలో అడుగు పెట్టిన బీఆర్‌ఎస్! కేటీఆర్ ఏం చెప్పారంటే?
Telangana Assembly Monsoon Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదిహేను రోజులపాటు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.

Telangana Assembly Monsoon Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అధికార ప్రతిపక్షాలు గట్టి ప్రణాళికతోనే సభలో అడుగుపెట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుతో బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ స్కెచ్ వేసింది. వరదలు, యూరియా సమస్యలపై ప్రభుత్వాన్ని సభలో దోషిగా నిలిబెట్టేందుకు గులాబీ నేతలు కౌంటర్ ప్లాన్ రెడీ చేశారు. రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని కేంద్రం సాయం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలను మోసం చేస్తోందని చెప్పేందుకు బీజేపీ అస్త్రాలను సిద్ధం చేసింది. మొత్తానికి తెలంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మాత్రం వేడిపుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో చనిపోయిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సమావేశాలు ప్రారంభమైన వెంటనే సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. రాష్ట్రానికి, నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాజకీయాల్లో ఆయన తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు.
సమావేశాలకు బయల్దేరే ముందు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపైన భారత రాష్ట్ర సమితి వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టింది. గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో ఆందోళన చేపట్టింది. యూరియా సంక్షేపానికి కారణం కాంగ్రెస్ పార్టీని అంటూ నినాదాలు చేసింది. పండగపూట కూడా రైతన్నలను రోడ్లపైన నిలబెట్టింది ఈ ప్రభుత్వము అని ఆరోపించారు. గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి అంటూ డిమాండ్ చేశారు. రేవంత్ దోషం రైతన్నకు మోసం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ ఏమన్నారంటే..."రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తాం. వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఏ అంశంపైననైనా సభలో చర్చకు పెడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వ్యవసాయ విస్తీర్ణంతోపాటు వ్యవసాయ సంక్షేమానికి కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, పథకాల గురించి వివరిస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం గురించి కూడా సమాధానం చెబుతాం. అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది, ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.
రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శాసనసభను తమకు అనుకూలంగా ఉండేలా నడిపించే ప్రయత్నం చేస్తోంది. రైతుల సమస్యల పైన, రాష్ట్రంలో ఉన్న ఎరువుల సంక్షోభం పైన మాట్లాడటం లేదు. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇలాంటి ఎరువుల కొరత రాలేదు. రైతులు లైన్లలో నిలబడాల్సిన దుస్థితి రాలేదు. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెప్పులను లైన్లో పెట్టడం, ఆధార్ కార్డులను లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది?. పండుగ రోజు కూడా రైతులు ఎరువుల కోసం లైన్లలో నిలబడి, వర్షంలో తడిసి ఇబ్బందులు పడే పరిస్థితి ఎందుకు వచ్చింది? పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, భారీ వర్షాల వల్ల ఇబ్బందుల గురించి గానీ సుదీర్ఘంగా చర్చించే అవకాశం అసెంబ్లీలో ఇవ్వండి." అని ప్రశ్నించారు.
అది పీసీ ఘోష్ కమిషన్ కాదు…
— BRS Party (@BRSparty) August 30, 2025
కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ ఘోష్ కమిషన్.
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/eXiptCZTXK
రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ సంక్షోభం పైన అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 600కుపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. 75 లక్షల మంది రైతులు అవస్థల్లో ఉన్నారని చెప్పారు. "రైతులకు కాంగ్రెస్ చేసిన మోసం పైన అసెంబ్లీలో చర్చ జరగాలి. ఆరు గ్యారెంటీల నుంచి 420 హామీల అమలు వైఫల్యాల దాకా అన్ని అంశాల పైన చర్చిద్దాం. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారు, వాటి పైన చర్చ జరగాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే ఒకటి రెండు అంశాల పైననే మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ప్రజల కష్టాలు, సమస్యల పైన చర్చలకు అసెంబ్లీ వేదిక కావాలి. కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగాలి. కాళేశ్వరంతో పాటు అన్ని అంశాల పైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, అది కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ ఘోష్ కమిషన్. దాని పైన కూడా కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం." అని అన్నారు.



















