Telangana Assembly Monsoon Sessions 2025: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై తుపాను: కేసీఆర్, హరీష్ రావులపై చర్యలుంటాయా? బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ!
Telangana Assembly Monsoon Sessions 2025: అధికార పార్టీకి, బీఆర్ఎస్ కు మధ్య కాళేశ్వరం విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana Assembly Monsoon Sessions 2025: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి(30/08/2025) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు నాలుగైదు రోజులు జరుగుతాయని చర్చ జరుగుతున్నప్పటికీ, ఎన్ని రోజులు సమావేశాలు జరపాలి అనే అంశంపై బీఏసీ సమావేశం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ పై పీసీ ఘోష్ కమిటీ సమర్పించిన నివేదికపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది.
కాళేశ్వరం నివేదిక ప్రధాన ఎజెండా
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ లోపాలు, అవినీతి అంశాలపై రేవంత్ ప్రభుత్వం పీసీ చంద్ర ఘోష్ కమిటీని నియమించడం, ఆ నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆ నివేదిక తప్పుల తడక అని, దాని ఆధారంగా చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, అసెంబ్లీలో చర్చించకుండా ఏ చర్య తీసుకోబోమని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇవ్వడంతో హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పరిణామం తర్వాత వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం చర్చకు దారి తీసింది.
అసెంబ్లీ సమావేశాల్లో పీసీ ఘోష్ నివేదికను సభలో ప్రవేశపెట్టి చర్చించే అవకాశాలున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా ముఖ్య నాయకులు ఫాంహౌస్‌లో సమావేశమై ఇదే అంశాన్ని చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే ఈ సమావేశాల్లో అధికార పార్టీకి, బీఆర్ఎస్ కు మధ్య కాళేశ్వరం విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశాలు ముగిశాక, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సహా, ఈ ప్రాజెక్టు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీశ్ రావు, ఇతర నాయకులు, అధికారులపై చర్యలు ఉంటాయా అనే చర్చ కూడా సాగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ
ఈ శాసన సభ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం గడువు విధించడంతో ఈ అంశం కూడా శాసన సభలో ప్రధాన ఎజెండా కానుంది. ఈ ఎన్నికలు నిర్వహించాలంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి గవర్నర్ ఆమోదానికి పంపగా, పరిశీలన నిమిత్తం గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపారు. ఇప్పటి వరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీనిని ఎన్డీఏ ప్రభుత్వం అడ్డుకుంటుందనే ఆరోపణలను ప్రభుత్వ పెద్దలు పలు వేదికలపై చేసిన పరిస్థితి ఉంది. అయితే, జీవో ద్వారా అమలు చేద్దామా అనే చర్చ కూడా శాసన సభలో జరిగే అవకాశం ఉంది. జీవో ఇస్తే అది న్యాయస్థానాల ముందు నిలబడదన్న విషయం అన్ని పార్టీలకు తెలిసిందే. అయితే, దీనిపై సభలో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలను అధికార పార్టీ తెలుసుకోనుంది.
శాసన సభ సమావేశాలకు ముందు రాష్ట్ర క్యాబినెట్ భేటీ
ఈ శాసన సభ ప్రారంభానికి ముందే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సభ నిర్వహణ, ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి ప్రధాన అంశాలన్నీ ఈ క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించనున్నారు.






















