తెలంగాణ సరిహద్దుల్లో ANPR కెమెరాలు: చెక్ పోస్టుల తనిఖీల్లో విప్లవాత్మక మార్పులు!
అత్యాధునిక ఆటోమెటిక్ నంబర్ రికగ్నిషన్ (ANPR కెమెరాలను చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేస్తే ఈ కెమెరాలు వాటి అంతట అవే ఆటోమెటిక్ గా వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేస్తాయి.

Telangana News: తెలంగాణ రాష్ట్ర రవాణా అథారిటీ (RTA) సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద అత్యాధునిక ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న 17 కీలక చెక్ పోస్టులలో ఈ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 3.5 కోట్ల వ్యయంతో 60 అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేయాలని RTA ప్రణాళికలు రచిస్తోంది.
ప్రస్తుతం చెక్ పోస్టులవద్ద తనిఖీలు ఎలా జరుగుతున్నాయి?
ప్రస్తుతం చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీని రవాణా శాఖ అధికారులు, వారి సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొని నిర్వహిస్తారు.చెక్ పోస్టుల ద్వారా రాష్ట్రంలోకి వచ్చే వాహనాలను ఆపి, వాటి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు (RC), రూట్ పర్మిట్లు, స్టేజ్ క్యారేజీ పర్మిట్లు, వాహన పన్ను చెల్లింపులు వంటివి సరిగా ఉన్నాయో లేదో చూస్తారు. వీటితో పాటు, వాహన కాలుష్య ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, వాహన బీమా పత్రాలను కూడా పరిశీలిస్తారు. ఓవర్‌లోడ్ ఉన్నాయేమోనని RTA అధికారులు తనిఖీ చేసిన తర్వాతే రాష్ట్రంలోకి ప్రవేశానికి అనుమతి ఇస్తారు. ఇన్ని పత్రాలు పరిశీలించేసరికి ఒక్కో వాహనానికి చాలా సమయం పడుతుంది. ఇది ప్రస్తుతం చెక్‌పోస్టుల వద్ద తనిఖీల పరిస్థితి.
ANPR కెమెరాల ఏర్పాటు వల్ల లాభం ఏమిటి?
అత్యాధునిక ANPR కెమెరాలను చెక్ పోస్టులవద్ద ఏర్పాటు చేస్తే, ఈ కెమెరాలు వాటి అంతట అవే ఆటోమేటిక్గా వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేస్తాయి. స్కాన్ చేసిన వెంటనే, ఈ నంబర్ వివరాలను డేటాబేస్‌లతో అనుసంధానిస్తారు. దీనివల్ల వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు తక్షణమే అక్కడి అధికారులు గుర్తించవచ్చు. ఆ వాహనం ఎక్కడ రిజిస్టర్ అయింది, వాటి పత్రాలు సరిగా ఉన్నాయో లేదో, కాలుష్య నియంత్రణ పత్రాలు, వాహన ఫిట్‌నెస్ పత్రాలు సరిగా ఉన్నాయో లేదో క్షణాల్లో తెలుసుకోవచ్చు. వాహనంపై ఎన్ని జరిమానాలు ఉన్నాయి, వాటిని చెల్లించారా లేదా అన్న వివరాలు తెలుసుకోవచ్చు.
దీనివల్ల వాహనదారులకు తనిఖీ సమయం గణనీయంగా తగ్గుతుంది. అధికారులకు కూడా అన్ని పత్రాలు పరిశీలించి చూసే పనిభారం తప్పుతుంది. అంతేకాకుండా, తనిఖీలు మరింత పారదర్శకంగా జరిగి, అవినీతి తగ్గుతుందని RTA అధికారులు చెబుతున్నారు. అక్రమ రవాణా, నకిలీ పత్రాలతో ప్రయాణాలు, అనుమతి లేని వాహనాల రాకపోకలను అడ్డుకోవడం, పన్ను ఎగవేతలను సమర్థంగా అడ్డుకోవచ్చని వారు అంటున్నారు. ఈ కెమెరాల వినియోగం వల్ల ఫిట్‌నెస్ లేని వాహనాలను అక్కడికక్కడే నిలువరించవచ్చు. దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయి. దీంతో పాటు, కాలుష్యం వెదజల్లే వాహనాలను అడ్డుకునే వీలుంటుంది.
ANPR కెమెరాల ఏర్పాటుకు పరిశీలనలో ఉన్న చెక్ పోస్టులు ఇవే:
ఈ అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రవాణా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, 17 కీలక చెక్ పోస్టులను ఎంపిక చేసి అక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ 17 చెక్‌పోస్టుల జాబితాను అధికారికంగా విడుదల చేయలేదు. కానీ, ఇతర రాష్ట్ర సరిహద్దుల దగ్గర ఉన్న ఈ చెక్‌పోస్టుల వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు:
తెలంగాణలోని ప్రధాన చెక్ పోస్టులు
- ఆదిలాబాద్ జిల్లా- ఆదిలాబాద్ చెక్ పోస్టు
- నిజామాబాద్ జిల్లా- సాలూర చెక్ పోస్టు
- సంగారెడ్డి జిల్లా- జహీరాబాద్ చెక్ పోస్టు
- కామారెడ్డి జిల్లా- మాద్నూర్ చెక్ పోస్టు
- నిర్మల్ జిల్లా- భైంసా చెక్ పోస్టు
- కుమరం భీమ్-ఆసిఫాబాద్ జిల్లా- వంకీడి చెక్ పోస్టు
- జోగులాంబ గద్వాల్ జిల్లా- అలంపూర్ చెక్ పోస్టు
- నారాయణపేట జిల్లా- కృష్ణ చెక్ పోస్టు
- నల్గొండ జిల్లా- నాగార్జున సాగర్ చెక్ పోస్టు
- నల్గొండ జిల్లా- విష్ణుపురం చెక్ పోస్టు
- సూర్యాపేట జిల్లా- కొదాడ చెక్ పోస్టు
- ఖమ్మం జిల్లా- కల్లూరు చెక్ పోస్టు
- భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా- అశ్వారావుపేట చెక్ పోస్టు
- భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా- పాల్వంచ చెక్ పోస్టు
వీటితో పాటు మరికొన్ని చెక్‌పోస్టుల వద్ద కూడా ఈ కెమెరాలను ఏర్పాటు చేయాలని RTA అధికారులు భావిస్తున్నారు. ఈ చెక్‌పోస్టుల పూర్తి జాబితా మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






















