Constable Yadaiah: ఛాతిపై 7 కత్తిపోట్లు! అయినా దొంగల్ని పట్టుకున్నా- కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి అవార్డు
Hyderabad News: ప్రాణాలకు సైతం పణంగా పెట్టి విధి నిర్వహణలో సాహసోపేతంగా వ్యవహరించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ సేవలకు గుర్తింపు లభించింది. రాష్ట్రపతి గ్యాలెంటరీ అవార్డు దక్కింది.
Telangana Constable: ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఏడు కత్తిపోట్లు. గుండెల మీద కత్తి గాయాలై రక్తం కారుతోంది. అయినా ఆ కానిస్టేబుల్ ఏమాత్రం చలించలేదు. విధినిర్వహణ ముందు ఆయనకు తన ప్రాణాలు గొప్పగా అనిపించలేదు. దొంగలను పట్టుకోవడానికి తన ప్రాణాలను పెట్టాడు. దొంగలను మాత్రం వదల్లేదు. వివరాల్లోకి వెళితే.. 2000 బ్యాచ్ కు చెందిన యాదయ్య సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ స్టేషన్లలో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించాడు.
దేశంలో యాదయ్య ఒక్కడికే శౌర్య పతాకం
రెండేళ్ల క్రితం ఇద్దరు దుండగులు ఇషాన్ నిరంజన్ నీలంనల్లి, రాహుల్ వరుస గొలుసు దొంగతనాలు, ఆయుధాల డీలింగ్ లకు పాల్పడుతున్నట్టు పక్కా సమాచారంతో వారిని పట్టుకునేందుకు యాదయ్యతో కూడిన పోలీస్ బృందం సమాయత్తం అయ్యింది. 2022 జులై 25న దొంగతనానికి పాల్పడుతుండగా యాదయ్య వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో దొంగలతో యుద్ధమే చేశాడు. చెయ్యి, వీపు, కడుపు, ఛాతి భాగాలపై దొంగలు కత్తులతో ఏడుసార్లు యాదయ్య శరీరంపై విచక్షణారహితంగా దాడి చేశారు. అయినా వారిని విడిచిపెట్టలేదు. యాదయ్య ఛాతీ పైనా కత్తిపోట్లు కావడంతో 17 రోజులపాటు ఆస్పత్రిపాలయ్యాడు. విధి నిర్వహణలో యాదయ్య చూపిన సాహసానికి కేంద్ర హోంశాఖ గ్యాలెంటరీ మెడల్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అవార్డును ప్రధానం చేసింది. అయితే ఈసారి అత్యున్నత రాష్ట్రపతి పురస్కారం దేశంలో ఒక్కరికే లభించింది. అది కూడా యాదయ్య కావడం విశేషం. యాదయ్యకు అవార్డు రావడం పట్ల తెలంగాణ డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తం చేస్తూ ఆయన్ను సత్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ, పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1037 మందికి ఈ పతకాలను ప్రదానం చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాలకు పోలీస్ పతకాలు
ఈ ఏడాది మొత్తం 1037 మందికి ఈ పతకాలు ప్రదానం చేయనున్నారు. ఇందులో 624 మందికి పోలీసు విశిష్ఠ సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలు, 208 మందికి పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంటరీ, 75 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు అందజేయనున్నారు. ఈ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మందికి, తెలంగాణ నుంచి 21 మందికి ఈ పతకాలు వరించాయి. ఇందులో రాష్ట్రంలో ఒకరికి రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం, ఏడుగురికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, 11 మందికి పోలీసు విశిష్ఠ సేవా పతకాలు అందుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం, 19 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు అందజేయనున్నారు.