NIMS: మీకు కరోనా సోకి తగ్గిందా? జాగ్రత్త.. ఈ కొత్త సమస్య రావొచ్చు, నిమ్స్‌లో ఆరుగురి చేరిక..
హైదరాబాద్‌లో ఇలాంటి సమస్యలతోనే పలువురు ఆస్పత్రుల్లో చేరారు. రోజుల వ్యవధిలోనే దాదాపు ఆరుగురు వ్యక్తులు తమకు బాగా కడుపునొప్పి వస్తోందని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు.
కరోనా నయమైన వేళ ఇప్పుడు ఆ వ్యాధి బారిన పడ్డ వారికి కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో కరోనా సోకిన డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో బ్లాక్ ఫంగస్ వంటి సమస్యలు తలెత్తాయి. తాజాగా మరో సమస్య కరోనా సోకి తగ్గిన వారిలో వెంటాడుతోంది. దీంతో వైరస్ అన్ని అవయవాలపై ప్రభావం చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కరోనా వైరస్ తాజాగా చిన్న పేగుల్లో కూడా సమస్యలు కలగజేస్తూ ఉందని తాజాగా తేలింది.
హైదరాబాద్‌లో ఇలాంటి సమస్యలతోనే పలువురు ఆస్పత్రుల్లో చేరారు. రోజుల వ్యవధిలోనే దాదాపు ఆరుగురు వ్యక్తులు తమకు బాగా కడుపునొప్పి వస్తోందని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వారిని పరీక్షించిన డాక్టర్లు బాధితుల చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టి గ్యాంగ్రేన్ రూపంలోకి మారినట్లుగా గుర్తించారు. గ్యాంగ్రేన్ అంటే కుళ్లిన స్థితి అని వైద్య వర్గాలు తెలిపాయి. ఈ బాధితుల్లో ఇద్దరు వ్యక్తుల్లో ఇలాంటి గ్యాంగ్రేన్ ఎక్కువగా ఉండటంతో పేగులను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వ్యక్తుల్లో కిడ్నీలు కూడా పాడయిపోయాయని.. వారికి డయాలసిస్ చేస్తూ ఐసీయూలో ట్రీట్ మెంట్ అందిస్తున్నామని తెలిపారు. వీరి పరిస్థితి చాలా విషమంగా ఉందని నిమ్స్ డాక్టర్లు తెలిపారు.
Also Read: పోలీసులతో వాగ్వాదం.. కాంగ్రెస్ శ్రేణులపై లాఠీ ఛార్జ్.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన నిరుద్యోగ సైరన్
ఈ సమస్య వచ్చిన మరో నలుగురికి కూడా శస్త్ర చికిత్స చేసి ఎఫెక్ట్ అయిన పేగును కొంతమేర తొలగించామని తెలిపారు. బాధితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు చెప్పారు. అయితే, ఇక్కడో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఈ సమస్య వచ్చిన ఆరుగురికి గతంలో వారికి కొవిడ్ సోకినట్లు వారికే తెలియదని వైద్యులు తెలిపారు. కొవిడ్ యాంటీబాడీలు వీరి శరీరంలో గుర్తించడం ద్వారా వారికి కరోనా వచ్చి తగ్గినట్లుగా తెలిసిందని డాక్టర్లు చెప్పారు.
Also Read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..
అంతేకాక, వీరిలో ఇద్దరు మాత్రమే ఇప్పటివరకు టీకా తొలి డోసు తీసుకున్నారు. కొవిడ్ అనంతరం వీరిలో ఈ సమస్య వచ్చినట్లు నిర్ధారణకు వచ్చామని నిమ్స్ వైద్యులు చెప్పారు. ‘‘కొవిడ్ సోకిన తర్వాత కొందరిలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో కరోనా చికిత్సలో భాగంగా యాంటికోగలెన్స్ (రక్తం పలుచన చేసే) మందులను కొన్ని రోజులపాటు డాక్టర్లు సూచిస్తున్నారు. తాజాగా ఈ ఆరుగురిలో కొన్ని రోజుల కిందే చిన్నపేగుల్లో రక్తం గడ్డకట్టింది. కొవిడ్ సోకడంతో ఇలా జరిగిందని, పేగులకు రక్తప్రసరణ అందకపోవడంతో అక్కడ శరీర కణజాలం చనిపోయి గ్యాంగ్రేన్‌గా (కుళ్లిపోయి) మారిందని డాక్టర్లు వివరించారు. దీన్నిబట్టి కడుపునొప్పి వంటి సమస్యలు ఉన్నవారు తగిన పరిక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచించారు.
Also Read: Amazon Great Indian Festival Sale: రెడ్‌మీ కొత్త టీవీల సేల్ నేడే.. రూ.16 వేలలోపే!