CM KCR Press Meet: ‘ఈరోజు పెద్దసార్ ప్రెస్ మీట్’ ఫేస్‌బుక్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనూహ్య పోస్ట్
నిజానికి సీఎం కేసీఆర్ నిన్ననే (అక్టోబరు 27) ఉంటుందని అంతా భావించారు. గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం అంటూ వార్తలు కూడా వచ్చాయి.
MLA Rega Kantha Rao Facebook Post: ప్రలోభాలకు గురైనట్లుగా చెబుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరైన రేగా కాంతారావు ఫేస్ బుక్‌లో ఓ కీలక పోస్టు చేశారు. ఇవాళ పెద్ద సార్ ప్రెస్ మీట్ అంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. సీఎం కేసీఆర్ నేడు ప్రెస్ మీట్ (CM KCR Press Meet) పెడుతున్నట్లుగా ఆయన హింట్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంపై నేడు సీఎం కేసీఆర్ స్పందిస్తారని రేగా కాంతారావు (MLA Rega Kantha Rao) క్లారిటీ ఇచ్చినట్లయింది. నిజానికి సీఎం కేసీఆర్ నిన్ననే (అక్టోబరు 27) ఉంటుందని అంతా భావించారు. గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఫాం హౌజ్ ఘటన జరిగినప్పటి నుంచి ప్రగతి భవన్ లోనే ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడిస్తారని, ఆ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తారని భావించారు. కానీ, గురువారం నాడు సీఎం ప్రెస్ మీట్ నిర్వహించలేదు.
ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూసిందనే వాదనను జాతీయ మీడియాలో సైతం వచ్చేలా చేసి ఈ ఘటనను దేశం మొత్తం హైలెట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం ఆయన రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్తున్నట్లుగా కూడా తెలిసింది. గంటల కొద్ది వీడియో, ఆడియో రికార్డింగులను స్వయంగా సేకరించారని, పూర్తి ఆధారాలతో ఎదురుదాడి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల విచారణలో పోలీసులు కొన్ని ఫోన్ సంభాషణలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది.
సంయమనం పాటించాలని కేటీఆర్ సూచన
రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై టీఆర్ఎస్ నాయకులు (KTR) ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీ నేతలు గట్టిగా తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతున్నప్పటికీ టీఆర్ఎస్ (TRS) నేతలు మాత్రం కాస్త నెమ్మదిగానే ఉన్నారు. కేసు విచారణ దశలో ఉన్నందున నాయకులెవరూ మాట్లాడవద్దని కేటీఆర్ ఇప్పటికే సూచన కూడా చేశారు.
మరోవైపు, ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (TRS MLAs Buying) రెండు రోజులుగా ప్రగతి భవన్‌లోనే ఉంటున్నారు. కేటీఆర్, హరీశ్ రావు కలిసి కేసీఆర్‌తో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల ఫోన్‌లలోనూ కీలక సంభాషణలు విచారణలో బయటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో నేతల బేరసారాలు, పార్టీలోని కీలక నేతల ప్రమేయం, సీబీఐ, ఈడీ కేసుల ప్రస్తావన వంటివి ఆడియో, వీడియోల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ అన్ని ఆధారాలను సేకరించి జాతీయ స్థాయిలో ఉద్యమానికి తెరలేపనున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా మునుగోడు ఉప ఎన్నికలో (Munugode Bypoll) తమ గెలుపును లఖించుకోవాలని పట్టుదలతో కూడా ఉన్నారు. ఈ నెల 30న మునుగోడు నియోజకవర్గం చండూరులో కేసీఆర్ సభ (KCR Meeting) ఉండనుంది. అక్కడ ఆయన ప్రసంగిచే తీరుపై ఆయన భవిష్యత్తు కార్యాచరణ మీద కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.