కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ విచారణ వెనుక అసలు కథేంటి? గన్ బెదిరింపుల వెనుక సీఎం హస్తం ఉందా?
కొండా సురేఖ ఓఎస్డీగా పని చేస్తోన్న సుమంత్ పై ప్రధాన ఆరోపణ గన్ తో బెదిరించడం. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని దక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ.

ఎవరీ సుమంత్? ఒక మంత్రిని వివాదంలోకి లాగిన ఈ వ్యక్తి ఎవరు? కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు తెచ్చిన ఈ సుమంత్ పై వచ్చిన ఆరోపణలేంటి? ఎందుకు సుమంత్ కోసం పోలీసులు వెతుకుతున్నారు? ఏకంగా కొండా సురేఖ ఇంటికి పోలీసులు అర్ధరాత్రి ఎందుకు వచ్చారు? అన్న అనుమానాలు ఇవాళ సర్వత్రా నెలకొన్నాయి.
దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు ఓఎస్డీగా సుమంత్
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా సుమంత్ పని చేస్తుండేవారు. కొండా సురేఖ అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆ శాఖ నోట్ ద్వారా సుమంత్ మంత్రి వద్ద ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా చేరారు. మంత్రి రోజువారీ కార్యక్రమాలను ఓఎస్డీగా చూస్తుంటారు. అయితే, సుమంత్ పై వచ్చిన అవినీతి, బెదిరింపు ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.
వివాదానికి దారి తీసిన బెదిరింపుల వ్యవహారం
కొండా సురేఖ ఓఎస్డీగా పని చేస్తోన్న సుమంత్ పై ప్రధాన ఆరోపణ గన్ తో బెదిరించడం. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని దక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం అంతా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడుగా పేరొందిన రోహిన్ రెడ్డి కార్యాలయంలో ఈ బెదిరింపు వ్యవహారం జరిగినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ఘటనపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఓఎస్డీ పదవి నుండి తప్పించిన ప్రభుత్వం
ఈ గన్ బెదిరింపు వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి చెవిన పడటంతో, ఆయన ఆదేశాల మేరకు అంతర్గత విచారణ జరిపినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజమని తేలడంతో, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో పని చేస్తూ మంత్రి కొండా సురేఖ వద్ద డిప్యూటేషన్ లో ఓఎస్డీగా పని చేస్తున్న ఆయన్ను తక్షణ విధుల నుంచి ఉన్నతాధికారులు అక్టోబర్ 14వ తేదీన తప్పించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
అరెస్టుకు పోలీసుల యత్నం, అర్ధరాత్రి హై డ్రామా
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. విధుల నుండి ప్రభుత్వం తొలగించగానే సుమంత్ అదృశ్యమయ్యారు. ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. అక్టోబర్ 15 అర్ధరాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న మంత్రి కొండా సురేఖ నివాసంలో ఉన్నారని సమాచారం రావడంతో, టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో కొండా సురేఖ కుమార్తె సుష్మిత పోలీసులను గేట్ వద్దే అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. వారెంట్ లేకుండా ఇంట్లోకి ఎలా వస్తారని నిలదీశారు. సుమంత్ అరెస్టుకు కారణాలేంటని ప్రశ్నించారు. ఇది జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ తన కారులో సుమంత్ ను ఎక్కించుకుని అక్కడి నుండి వెళ్లిపోయారని ప్రచారం సాగింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. అసలు ఈ వ్యవహారంలో సీఎం పాత్ర ఉందని, ఆయనే గన్ పంపారని, సీఎం సన్నిహితుడు రోహన్ రెడ్డినే అడగాలంటూ సుష్మిత చేసిన ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదిరింది. ఏది ఏమైనా, కొండా సురేఖ మాజీ ఓఎస్డీ వ్యవహారం ఇప్పుడు కొండా సురేఖ వేటుకు కారణం కానుందా? అన్న చర్చ సర్వత్రా సాగుతోంది.





















