(Source: Poll of Polls)
Konda Surekha: కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు! తప్పిస్తారా? తప్పుకునేలా చేస్తారా? అధిష్ఠానం స్టాండ్ ఏంటీ?
Konda Surekha: కొండా సురేఖ మంత్రిపదవి ప్రమాదంలో పడింది. ఓఎస్‌డీను కాపాడుకునే క్రమంలో జరిగిన పరిణామాలపై రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

Konda Surekha: కొండా సురేఖ మంత్రిపదవికి ఎసరు వచ్చింది. ఆమెను తప్పించేందుకు రంగం సిద్ధమైనట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులపై ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలతోపాటు కొండ సురేఖ కూడా సన్నిహితుల వద్ద ఇలాంటి కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మొదటి నుంచి ఆమె వివాదాల్లో ఇరుక్కోవడం తర్వాత ప్రభుత్వం వాటిని సమర్థించుకోవడం సాధారణంగా మారింది. ఇప్పటి వరకు ఎక్కువ వివాదాల్లో ఇరుక్కున్న మంత్రిగా కొండా సురేఖ పేరు పొందారు. కేటీఆర్, నాగార్జున ఫ్యామిలీ ఇష్యూలపై మాట్లాడటం, తర్వాత ఓ ప్రైవేటు పార్టీలో మందు గురించి మాట్లాడటం, తోటి మంత్రులతో గిల్లికజ్జాలు, ఇలా వివిధ రకాలైన వివాదాల్లో ఇరుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వెలుగు చూసిన వివాదం మరింత రచ్చకెక్కింది. ఎకంగా ఓ కంపెనీ ప్రతినిధులను గన్‌తో బెదిరించిన వ్యక్తికి వంతపాడుతూ కాపాడే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. మొదటి నుంచి వివాదాల మంత్రిగా ఉన్న కొండా సురేఖపై మొత్తం మంత్రిమండలే గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే దీనిపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేసి తప్పించాలని చూస్తున్నారు. బుధవారం నుంచి ఓఎస్‌డీ చుట్టూ రాజుకున్న వివాదంలో ఆమె కుమార్తె చేసిన కామెంట్స్ మరింత కాక రేపాయి. ఏకంగా టెండర్ల పేర్లతో, సెటిల్మెంట్ల పేర్లతో దోపిడీ జరుగుతుంది అని సిట్టింగ్ మినిస్టర్ కూతురే కామెంట్స్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
సీఎం అనుచరుడు రోహిణ్ రెడ్డి దందాలు చేస్తున్నారని, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి గురించి, రేవంత్ అంతర్గత విషయాలపై సుస్మిత బహిరంగంగా మీడియా ముందు విమర్శలు చేశారు. వీటన్నింటిపై గుర్రుగా ముఖ్యమంత్రి ఇంకా కొండా సురేఖను కొనసాగిస్తే వాటికి సమ్మతించినట్టు అవుతుందని భావిస్తున్నారట. అందుకే ఆమెను తప్పించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. మేడారం పనుల టెండర్లతో మొదలైన వివాదం ఇప్పుడు మరింత పీక్స్ వెళ్లింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి మీటింగ్స్‌కు కొండా సురేఖ దూరంగా ఉంటున్నారు. ఇవాళ కేబినెట్‌కు వస్తారో రారో కూడా తెలియడం లేదు. అందుకే ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత టీంగా పని చేయడం కష్టమని సీఎం సన్నిహతులు చెబుతున్నారు.
అయితే కొండా సురేఖను తప్పించేందుకు అధిష్ఠానం ఓకే చెబుతుందా లేదా అన్నది మాత్రం అనుమానంగా ఉంది. అసలే బీసీల కోసం పోరాడుతున్న పార్టీగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఈ టైంలో ఓ బీసీ మహిళను తప్పిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది బేరీజు వేసుకుంటున్నారు. దీనికి కౌంటర్‌గా ఏం చేయాలనే విషయంపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అసలే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, మరోవైపు లోకల్ బాడీ ఎన్నికల వేళ కొండా సురేఖపై తీసుకునే నిర్ణయం పార్టీకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. అసలే కోర్టు వివాదాలతో బీసీ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు నిరసనలు చేపడుతున్నారు. ఈ టైంలో ఈ నిర్ణయం తీసుకుంటే వచ్చే పరిణామాలపై సమాలోచనలు జరుపుతున్నారు.
సురేఖతో పార్టీ పెద్దలు మాట్లాడి ఆమెకు స్వతహాగా తప్పుకునేలా కూడా ఒప్పించే ఛాన్స్ ఉందని అంటున్నారు. తనపై తన అనుచరులపై ఆరోపణలు వచ్చినందుకు అవి నిర్దారణ అయ్యే వరకు పదవికి దూరంగా ఉంటానని చెప్పే ఆస్కారం లేకపోలేదని, దీని వల్ల రెండు వర్గాలను కూల్ చేసినట్టు అవుతుందని కూడా పార్టీలోని ఓ వర్గం ప్రయత్నాలు చేస్తోంది.





















