Konda Surekha vs Revanth Reddy: గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత
తెలంగాణ మంత్రి కొండ సురేఖ ఓఎస్డీ సుమంత్ వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్‌గా మంత్రి కుమార్తె సుస్మిత చేస్తున్న విమర్శలు సంచలనంగా మారుతున్నాయి.

Konda Surekha vs Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వాన్ని కొత్త వివాదం ఊపేస్తోంది. మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంత్ ఓ సిమెంట్ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించారనే ఆరోపణలు రాజకీయ కలకలం రేపుతున్నాయి. అనంతర పరిణామాలతో వివాదంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులను కూడా లాగుతున్నారు మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత. బుధవారం అర్థరాత్రి నుంచి జరుగుతున్న హైడ్రామాలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి.
ఈ వివాదంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా ఫ్యామిలీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరికొందరు రెడ్లు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బీసీలను అణగదొక్కుతున్నారని అన్నారు. ఇందులో కడియం శ్రీహరితోపాటు వరంగల్‌జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలంతా భాగమై ఉన్నారని అన్నారు. ఢిల్లీ పెద్దలు బీసీలను ఎదగాలనే స్పీచ్‌లు ఇస్తుంటే తెలంగాణలో మాత్రం తొక్కుతున్నారని మండిపడ్డారు. రోహిణ్ రెడ్డికి గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి అని, ఆయన చెబితే ఇదంతా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
సుస్మిత కామెంట్స్ ఏంటంటే...."రెడ్డిలు అంతా కలసి మా కుటుంబం మీద పగ పట్టారు. మా కుటుంబం మీద రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. రోహిణ్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి అతను సుమంత్‌ను పిలిచారు. సుమంత్ వెళ్ళి మాట్లాడి వచ్చేశాడు అంతే. ఈరోజు కేసు పెట్టి, అర్ధరాత్రి మా ఇంటికి పోలీసులను పంపి మా అమ్మను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి లాయల్‌గా ఉండడమే మేము చేసిన తప్పా.. రేవంత్ రెడ్డి మా కుటుంబం మీద ఎందుకు పడ్డారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డికి, కొండల్ రెడ్డికి గన్ మెన్లు ఎందుకు ఉన్నారు అసలు?. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేశారని వాళ్ళకి గన్ మెన్లను ఇచ్చారు."
ఇదంతా మేడారం పనుల టెండర్ల నుంచి మొదలైందని సుస్మిత చెప్పుకొచ్చారు. "మా అమ్మ పరిధిలో ఉన్న ఎండోమెంట్ శాఖలో టెండర్ పడితే అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు కావలసిన వాళ్ళకు ఇచ్చుకున్నారు. ఆ టెండర్ ఫిజికల్ బిడ్ తెరిచినప్పుడు మా వాళ్ళకు వచ్చినా పొంగులేటి తీసుకున్నారు. మా అమ్మకు ఫోన్ చేసి విత్ డ్రా చేసుకోమని చెప్పారు. మేము ఎందుకు చేసుకుంటాం అంటే మాకు తెలియకుండా వాళ్ళ వ్యక్తికి ఇచ్చుకున్నారు. ఆ టెండర్ మా అమ్మ శాఖ నుంచి వెంటనే రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు." అని ఆరోపించారు.
తర్వాత ఓ వీడియో రిలీజ్ చేసిన సుస్మిత... పోలీసులు తన ఇంటి చుట్టూ ఉన్నారని బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కార్యకర్తలు నమ్మని వాళ్ల కోసం నిలడతామని తెలిపారు. ఇందులో అందరి కుట్రలను బహిర్గతం చేస్తామని శపథం చేశారు. తమను ఎవరూ ఏం చేయలేరని పేర్కొన్నారు.
డబ్బులు ఇవ్వాలని డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధుల పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించారని కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌పై ఆరోపణలు వచ్చాయి. రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఆఫీసులోనే ఈ ఘటన జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. హుజూర్ నగర్ నియోజకవర్గానికి డైరెక్ట్‌గా సంబంధం ఉండటంతో ఈ విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఆయన్ని రెండు రోజుల క్రితమే విధుల నుంచి తప్పించింది.
బెదిరించిన విషయాన్ని తెలుసుకున్న సీఎం... సుమంత్‌ను విచారించాలని సూచించారు. అవసరం అయితే అరెస్టు చేసి ఏం జరిగిందో తెలియజేయాలని చెప్పారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు సుమంత్ కోసం గాలించారు. చివరకు సురేఖ ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్నారు. వెళ్లే సరికి సుస్మిత వారిని అడ్డుకున్నారు. ఈ హడావిడి నడుస్తున్న టైంలోనే సుమంత్‌ను తన కారులో ఎక్కించుకొని సురేఖ మంత్రిక్వార్టర్స్‌కు వెళ్లిపోయారు. ఇప్పుడు సుమంత్‌ను పోలీసులకు అప్పగిస్తారా లేదా, సాయంత్రం జరిగే మంత్రిమండలి భేటీకి వస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.





















