Hyderabad News: మాసబ్ ట్యాంకులో జీహెచ్ఎంసీ పార్కు స్థలం ఆక్రమణ - నిర్మాణాలను తొలగించిన అధికారులు
Hyderabad News: హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని పలువురు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఈక్రమంలోనే అధికారులు ఆ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు.
Hyderabad News: హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో ఆక్రమణల కూల్చివేత ఇంకా కొనసాగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని పలువురు ఆక్రమణదారులు ఆక్రమించారు. అక్కడే నిర్మాణాలను చేపట్టి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే విషయం గుర్తించిన బల్దియా అధికారులు అక్రమంగా వెలసిన నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. బెస్తివాడ బస్తీ వాసులను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో అధికారులను బెస్తివాడ వాసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే భారీగా పోలీసులు మోహరించారు. ఇళ్ల కూల్చివేతతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఎటూ వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. రోడ్డుపైనే ఉండి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 150కి పైగా నివాసాలను అధికారులు కూల్చివేశారు. దాదాపు 17 ఏళ్ల నించి ఇక్కడే నివాసం ఉంటున్నామని తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు రోడ్డు పాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు బలగాలతో మంగళవారం తెల్లవారుజాము నుంచి అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. 17 ఏళ్లుగా అక్కడే ఉంటూ, ఇంటి పన్నులతో పాటు కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు కట్టాల్సిన అన్ని బిల్లులను కడుతున్నామని చెప్పారు. అయినా అధికారులు తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టాలతో రోడ్డుపై పడేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారుల వెర్షన్ మరోలా ఉంది. జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని ఆక్రమించి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని, ఇందుకు సంబంధించి గతంలో నోటీసులు ఇచ్చామని.. అయినా ఎవరూ ఖాళీ చేయకపోవడంతోనే గుడిసెలు కూల్చేస్తున్నామని వివరించారు. అంతేకకుండా అక్రమ నిర్మాణదారులపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు వివరించారు. అందులో భాగంగానే ఈరోజు బెస్తివాడలో కూల్చివేతలు చేసినట్లు స్పష్టం చేశారు.
గతేడాది ఆగస్టులో శంషాబాద్ మసీదును కూల్చి వేసిన అధికారులు..
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో మున్సిపల్ అధికారులు మసీదుని కూల్చివేయటం పెద్ద వివాదానికి దారి తీసింది. శంషాబాద్ శివార్లలోని గ్రీన్ అవెన్యూ కాలనీలోని మసీదుని 2022వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీ తెల్లవారు జామున కూల్చి వేశారు. పోలీసుల ఆధ్వర్యంలోనే ఈ కూల్చివేత జరిగిందని స్థానిక ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఇది చూసి ముస్లిం నేతలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి నిరసన చేపట్టారు. AIMIM నేతలతో పాటు మజ్లిస్ బచావో తెహరీక్ (MBT)నేతలూ ఆందోళనలు చేశారు. మూడేళ్ల క్రితం ఈ మసీదు నిర్మించారని, రోజుకు 5 సార్లు నమాజ్ చేసుకుంటామని చెప్పారు ముస్లిం నేతలు. శంషాబాద్ గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చిన తరవాతే 15 ఎకరాల్లో ఉన్న గ్రీన్ అవెన్యూ కాలనీలో ప్లాట్‌లు చేసి విక్రయించారని చెబుతున్నారు. ఇందులో 250 చదరపు గజాల స్థలం..మసీద్‌కు కేటాయించారని వెల్లడించారు. మసీదు పక్కనే ఇళ్లు ఉన్న కొందరు, నిబంధనలకు వ్యతిరేకంగా మసీదు కట్టారని కోర్టులో కేసు వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతుండగానే, అధికారులు ఇలా కూల్చివేయటం సరికాదని ముస్లిం నేతలు మండి పడుతున్నారు. మున్సిపాలిటీ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వీరిని అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెరాస అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 6 మసీదులను ఇలాగే కూల్చివేశారని ఆరోపించారు.