Hyderabad Metro Rail: మెట్రో రైలు కాలుష్యం తగ్గించడమే కాదు విద్యుత్ ఇస్తోంది- సగం హైదరాబాద్‌కు రోజంతా సరఫరా చేసేయొచ్చు!
Hyderabad Metro Rail: మెట్రోరైలు కరెంటు వాడుకోవడంతో పాటు అదే 40 శాతం విద్యుత్తును తయారు చేసుకొని పునర్వినియోగం చేసుకుంటోంది. మెట్రో రైలులో బ్రేక్ వేసన ప్రతీ సారి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలులో బ్రేక్ వేసిన ప్రతీసారి విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. మెట్రోలో ఉండే రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ వల్ల ఇది సాధ్యం అవుతోంది. అయితే మెట్రో రైలు వాడుకునే విద్యుత్తులో 40 శాతం అదే తయారు చేసుకుని మళ్లీ వాడుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరం 36 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మెట్రో బ్రేకింగ్ తో ఉత్పత్తి చేసింది. ఇది హైదారబాద్ లో సగం ప్రాంతానికి ఒకరోజంతా సరఫరా చేయవచ్చు. మొత్తంగా అయితే 6500 ఇళ్లకు ఏడాది పాటు ఈ విద్యుత్తు చక్కగా సరిపోతుంది. మెట్రో రైలుకు చెందిన రెండు డిపోలు, 28 స్టేషన్ల సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వీటి సామర్థ్యం 8.35 మెగావాట్లు. కొత్తగా మరో 5.5 మెగావాట్ల సౌర విద్యుత్తు ఫలకలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ప్లాంట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 11 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేశారు. మెట్రో మొత్తం కరెంటు వినియోగంలో ఇది పది శాతం.
మెట్రో వల్ల మస్తుగా లాభాలు, ముఖ్యంగా కాలుష్యానికి చెక్
మెట్రో రైలులో ప్రయాణించడం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో వాతావరణంలో కలిసే కార్బన్ డై యాక్సైడ్ 88 మిలియన్ కిలోలు ఉత్పత్తి కాకుండా చేయగల్గుతారు. ఇది 1750 చెట్లతో సమానం. 28 మిలియన్ లీటర్ల పెట్రోలు, డీజిల్ ఆదా అయింది. 2040 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా శాతానికి తేవాలనేది ఎల్ అండ్ టీ లక్ష్యం. మెట్రోలో ఏడాది కాలంలో సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తే పర్యావరణ పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ట్రాఫిక్ తగ్గాలన్నా, కాలుష్యం హద్దులు దాటొద్దు అన్నా ఈ సంఖ్య మరింత పెరగాలని గతంలో మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో 15 లక్షల మంది మెట్రోలో రాకపోకలకు అవకాశం ఉందని తెలిపారు.
ప్రజారవాణా పెరిగితే మరిన్ని ఉపయోగాలు
నగరం నివాస యోగ్యంగా ఉండాలంటే కాలుష్యాన్ని నియంత్రించాలి. అవకాశం ఉన్న చోట ప్రజారవాణాను ఉపయోగించాలి. వారంలో ఒకరోజు వాహనాన్ని వదిలి ప్రయాణించేలా అలవాటు చేసుకోవాలి. ప్రజారవాణా వాడకం పెరగాలంటే ప్రయాణికుడి గమ్యస్థానం దాకా ప్రజారవాణా వ్యవస్థను పెంపొందించాలి. మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఆటో, క్యాబ్ లన్నింలోననూ చెల్లుబాటు అయ్యేలా కామన్ మొబిలిటీ స్మార్ట్ కార్డును అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది.