Hyderabad: 11మందితో పెళ్లి! 3 వీధుల్లో ముగ్గురు భార్యలు, ఒకరి దగ్గర డబ్బు గుంజి మరో భార్యతో సంసారం
Kondapur: ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. వారందరినీ పక్క పక్క వీధుల్లోనే ఉంచాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో కాపురం చేసి చివరకు దొరికిపోయాడు.
పెళ్లంటే నూరేళ్ల పంట. ఇది జీవితంలో ఒకేసారి చేసుకుంటారు అనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే కొందరికి అదృష్టం బాగాలేక రెండో సారి, మూడో సారి కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని మనం తప్పు పట్టలేం. కానీ ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు భార్యలను ఒకే కాలనీలో పక్క పక్క వీధుల్లో ఉంచుతూ ఒకరికి తెలియకుండా ఒకరితో కాపురం చేశాడు. ఒకరి నుంచి రూ.లక్షల్లో డబ్బులు గుంజి మరో మహిళతో కాపురం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతంలో వెలుగు చూసింది.
అంత మందిని పెళ్లెలా చేసుకున్నాడు?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివ శంకర్ బాబు వివాహ పరిచయ వేదిక ద్వారా పలువురు యువతులను పరిచయం చేసుకున్నాడు. వివాహమై విడాకులు తీస్కున్న యువతులనే లక్ష్యంగా పెట్టుకొని ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేస్కునేకంటే ముందు తానో పెద్ద కంపెనీ ఉద్యోగం చేస్తునానని తనకు వాళ్లతో ఎక్కువ సేపు గడిపే సమయం ఉండదంటూ మాయమాటలు చెప్పాడు. ఎలాగోలా కష్టపడి వారిని పెళ్లి చేస్కున్నాడు. అయితే మోసపోయిన యువతులు అందరూ ఉన్నత విద్య అభ్యసించినవారే కావడం చాలా ఆశ్చర్యకరం. అంత చదివిన వాళ్లనే అమాంతం బుట్టలో వేసేసి.. అందిన కాడికి దోచుకొని పారిపోయాడు.
పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని.. డే అండ్ నైట్ డ్యూటీ ఉంటుందంటూ ముందుగా నమ్మబలుకుతాడు. ఇలా చెప్పే తమను పెళ్లి చేసుకున్నాడంటూ ఓ ఇద్దరు యువతులు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పెళ్లి అయిన తర్వాత అవసరాల కోసమని వారి వద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకొని వెళ్లిపోయాడట. ఫోన్ చేసినా, ఎక్కడ వెతికినా ఎలాంటి ఆచూకీ లేదని తెలిపారు. మళ్లీ ఇంటికి వస్తే క్లయింట్ వద్దకు వెళ్లానంటూ కబుర్లు చెప్పి తప్పించుకునేవాడని చెప్పారు. పెళ్లి పేరుతో మోసం చేసి దాదాపు తమ వద్ద నుంచి 60 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నాడంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏ ఉద్యోగం లేని అతను క్లయింట్ వద్దకు వెళ్తున్నానని చెప్పి మరో భార్య దగ్గరకు వెళ్లే వాడని వాపోయారు. మోసపోయిన 11 మందిలో ఏడుగురు కొండాపూర్ ప్రాంతంలోనే ఉన్నారని తెలిపారు. పక్క, పక్క వీధుల్లో భార్యలను ఉంచి మోసానికి పాల్పడ్డాడని బాధితులు చెబుతున్నారు. పక్క పక్క వీధుల్లో ఉన్నందునే తమకు ఈ విషయం తెలిసిందని.. లేకపోతే ఈ విషయం తెలిసే అవకాశం కూడా ఉండకపోయేదని వాపోతున్నారు. అయితే తామిద్దరికి కూడా ఏపీకి చెందిన ఓ మంత్రి బంధువని శివశంకర్ చెప్పినట్లు పేర్కొన్నారు. తాము మోసపోయినట్లు మరొకరు మోసపోవద్దనే మీడియా ముందుకు వచ్చినట్లు బాధితులు తెలిపారు. శివశంకర్ ను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
Also Read: Kukatpally Theft: హైదరాబాద్‌లో కొత్త గ్యాంగ్ హల్‌చల్ - ఇలాంటివారిని పనిలో పెట్టుకుంటే ఇల్లు గుల్లే!