Hydra Demolitions : హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో రూ.3,600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన 'హైడ్రా'– హైకోర్టు తీర్పు అమలుతో కబ్జాదారులకు షాక్
Hydra Demolitions : హైడ్రా మిషన్ కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 36 ఎకరాల విలువైన భూమిని అక్రమదారుల నుంచి రక్షించారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపింది.

Hydra Demolitions : హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, కబ్జాలకు గురైన భూములను రక్షించే ప్రక్రియను హైడ్రా విజయవంతంగా చేస్తోంది. హైడ్రా అధికారులు చేపడుతున్న కఠిన చర్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్‌లో ఏకంగా రూ.3,600 కోట్ల విలువైన 36 ఎకరాలను హైడ్రా అధికారులు రక్షించారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ‘హైడ్రా’ సంస్థ భారీ ఎత్తున కూల్చివేతల ఆపరేషన్ చేపట్టింది. ఈ కూల్చివేతలు కేవలం ప్రభుత్వ ఆస్తిని రక్షించడం మాత్రమే కాకుండా, భూ కబ్జాదారులకు బలమైన హెచ్చరికగా నిలిచాయి.
ఆపరేషన్ కొండాపూర్‌తో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం
ఆర్టీఏ కార్యాలయం పక్కనే ఉన్న భిక్షపతి నగర్ ఏరియాలో ఆపరేషన్ కొండాపూర్ హైడ్రా చేపట్టింది. సర్వే నంబర్ 59లో ఉన్న ఈ 36 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కొంతమంది వ్యక్తులు ఆక్రమించారు. తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. వ్యాపార కార్యకలాపాలు చేపట్టారు. దీనిపై హైడ్రాకు అనేక ఫిర్యాదులు వచ్చారు. ఈ ఫిర్యాదులతో కదలిన అధికారులు చర్యలకు ఉపక్రమింంచారు. పకడ్బందీగా ఆక్రమణలు తొలగించారు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఈ విచారణలో భాగంగా ఆక్రమణలు తొలగించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా సిబ్బంది ఈ ఆక్రమణల తొలగింపును అత్యంత పకడ్బందీగా చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు, ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పూర్తి బందోబస్తుతో ఆపరేషన్ చేపట్టిన అధికారులు ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించలేదు. దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో కారిడార్లు ఏర్పాటు చేశారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించారు. అది ప్రభుత్వ భూమి అని చెప్పే బోర్డులు ఏర్పాటు చేశారు. చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు.
రూ. 3,600 కోట్ల విలువైన భూమి కబ్జా వెనుక ఆంతర్యం
కొండాపూర్ ప్రాంతం హైదరాబాద్ నగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత విలువైన స్థిరాస్తి మార్కెట్‌లలో ఒకటి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్ 59లోని ఈ 36 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ దాదాపు రూ. 3,600 కోట్లు ఉంటుందని అంచనా.
హైడ్రా చేపట్టిన ఈ ఆక్రమణల తొలగింపులో మరో కోణం వెలుగు చూసింది. తమ భూములు గత 60 ఏళ్లుగా తమ అధీనంలోనే ఉన్నాయని కొంతమంది రైతులు చెబుతున్నారు. భూమిని ఆక్రమించుకున్న కొందరు వ్యక్తులు, వ్యాపారం చేసుకుంటున్న వారు, తాత్కాలిక షెడ్లు వేసుకున్న వారు కాకుండా, ఈ భూమిపై తమకు హక్కు ఉందని రైతులు చెబుతున్నారు.
అధికారులు హైకోర్టు తీర్పు మేరకు చర్యలు చేపట్టినప్పటికీ, రైతుల 60 ఏళ్ల అధీనంపై ఉన్న వాదన చట్టపరమైన సవాళ్లకు దారి తీసే అవకాశం ఉంది. అయితే, ఈ ఆక్రమణ తొలగింపు చర్య హైకోర్టు ఆదేశాల మేరకు జరగడంతో, ప్రభుత్వపరంగా పాలనాపరమైన చర్యలు వేగంగా పూర్తయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో భూ వివాదాల పరిష్కారం, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు హైడ్రాను పటిష్టం చేసింది. ఎన్ని వివాదాలు, సమస్యలు వచ్చినా ముందుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు.



















