Hydra Ayudha Puja: హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
Hydra Ayudha Puja: హైడ్రా వాహనాలకు ఆయుధపూజ చేసారు సిపి రంగనాథ్. ఆక్రమణల తొలగింపు, ముంపు బారి నుండి నగరాన్ని రక్షించడంలో కృషి చేసిన ఉద్యోగులకు నూతన వస్త్రాలు అందజేశారు.

Hydra Ayudha Puja: దుర్గానవరాత్రి వేడుకల్లో దసరాకు ముందుగా ఆయుధపూజలు నిర్వహించడం అనేక సంస్దల్లో ఆనవాయితీగా వస్తోంది. అదే తరహాలో హైడ్రా సైతం ఈ ఏడాది వైభవంగా ఆయుధ పూజలు నిర్వహించింది. ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఆక్రమణలు కూల్చేయడం, ప్రభుత్వ స్దలాలు ఆక్రమించి కట్టిన భారీ భవనాలను సైతం పేకమేడల్లా మట్టికరిపించడంలో కీలకంగా వ్యవహరించేవి హైడ్రాకు చెందిన అత్యంత అధునాతన వాహనాలు. హైడ్రా వాహానాలు కూల్చివేతల స్పాట్‌కు చేరుకుంటే ఆక్రమణదారుల గుండెలు గుబేలుమంటాయి. అయితే అదే వాహానాలకు దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైడ్రా కార్యాలయంలో జరిగిన దసరా ప్రత్యేక పూజల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. హైడ్రా వాహనాల పార్కింగ్ యార్డులో ఉన్న దుర్గ గుడి వద్ద హైడ్రా వాహనాలకు ఆయుధ పూజలు నిర్వహించారు. యార్డులో జేసీబీలతోపాటు వాహనాలు, నీటిని తోడే ఇంజన్లు, హైడ్రా DRF సిబ్బంది వాడే పనిముట్లకు పూజలు చేశారు. పూజల తరువాత హైడ్రాలో పని చేస్తున్న DRF సిబ్బందితోపాటు, డ్రైవర్లకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నూతన వస్త్రాలు, స్వీట్ బాక్సులు అందజేశారు సీపీ రంగనాథ్. మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ చేశారు. దీంతో హైడ్రా వాహనాల పార్కింగ్ యార్డులో సందడి వాతావరణం నెలకొంది. ఈ వర్షాకాలంలో హైడ్రా సిబ్బంది అందించిన సేవలను కమిషనర్ రంగనాథ్ కొనియాడారు. ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడమే క్ష్యంగా పని చేయాలని సిబ్బందికి సూచించారు. 























