Hyderabad Floods: భాగ్యనగరంలో భారీ వర్షం - పొంగిపొర్లుతున్న మూసీ నది, ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్
Hyderabad Floods: భాగ్యనగరంలో భారీగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మూసీ నది పొంగుపొర్లుతోంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది.
![Hyderabad Floods: భాగ్యనగరంలో భారీ వర్షం - పొంగిపొర్లుతున్న మూసీ నది, ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్ Hyderabad Floods Musi River Flow Danger Level And Huge Traffic Jam in Hyderabad Hyderabad Floods: భాగ్యనగరంలో భారీ వర్షం - పొంగిపొర్లుతున్న మూసీ నది, ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/05/c4ef88f9995d27cc1f8ebd4c34796a631693892603600519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad Floods: హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు రాజేంద్రనగర్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈక్రమంలోనే లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం అయితే తప్ప అస్సలే బయటకు రాకూడదని హెచ్చరించారు. అలాగే మూసీ నది పొంగి పొర్లుతుండడంతో ఒడ్డున ఉన్న కాలనీల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాలన్నీ నీటిమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గుతోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. బేగంపేట ప్రకాశ్ నగర్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలోనూ భారీ సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి.
మూసాపేట మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో దాదాపు ఐదు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. శంషాబాద్ లోనూ భారీ ట్రాఫిక్ స్తంభించింది. జీడిమెట్ల ఫస్ట్ ఎవెన్యూ కాలనీలో నీరు నిలవగా.. కూకట్ పల్లిలో 14 సెంటీ మీటరల్ అత్యధిక వర్షపాతం నమోదు అయింది. కూకట్ పల్లి దీన్ దయాల్ నగర్ లోకి వరద నీరు వచ్చి చేరింది. ఫతేనగర్ రోడ్లపైకి భారీగా నీరు వచ్చింది. నిజాంపేట ఈశ్వర విల్ల వద్ద ఐదు అడుగుల మేర నీట మునిగింది. అల్వాల్ మచ్చబొల్లారంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నార్సింగిలోని బాలాజీ నగర్ కాలనీలో చెరువును తలపిస్తోంది. అధికారులు అప్రమత్తమై నీటి నిల్వలేకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. సమస్య ఉంటే వెంటనే జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ 040-21111111కు లేదా 100కు, 9000113667కు ఫోన్ చేయాలని అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. వర్షాలు కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని స్కూల్స్‌కు సెలవులు ప్రకటిస్తున్నట్టు విద్యా శాఖ ప్రకటించింది.
పరిస్థితి గమనించిన వాతావరణ శాఖ హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తోంది. ఈ రోజంతా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెబుతోంది. భారీగా పడుతున్న వర్షంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. మరికొన్ని ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి నీళ్లు చేరాయి. జీడిమెట్ల, మారేడుపల్లి, ఎల్బీనగర్, సాగర్ రింగ్‌రోడ్డు, హస్తినాపురం, నిజాంపేట, అల్విన్ కాలనీ, చిలకలగూడ, సికింద్రాబాద్, సోమాజీగూడ, ఖైరతాబాద్, అమీర్‌పేట, ప్రగతీనగర్, కూకట్‌పల్లి, అడ్డగుట్ట, కంటోన్మెంట్, బోయినపల్లి, కర్ఖానా, మెహదీపట్నం, టోలీచౌకి, షేక్‌పేట, మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, మెట్టుగూడ, తార్నాక, ఉప్పల్, కోఠఈ, మలక్‌పేట, దిల్‌షుక్‌నగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది.
హైదరాబాద్‌లోని వివిధప్రాంతాల్లో కురిసిన వర్షపాతం ఇలా ఉంది.
- శేరిలింగంపల్లి - 14 సెం.మీ
- మియాపూర్‌లో 14 సెం.మీ
- కూకట్ పల్లి, హైదర్‌నగర్ - 12.7 సెం.మీ
- రాజేంద్రనగర్ - 12 సెం.మీ
- షేక్‌పేట -11.9 సెం.మీ
- బోరబండ -11.6 సెం.మీ
- మాదాపూర్ -10.7 సెం.మీ
- రాయదుర్గం -10.1 సెం.మీ
- ఖైరతాబాద్ -10.1 సెంమీ
- గాజులరామారం- 10సెం.మీ
- రాజేంద్రనగర్- 10 సెం.మీ
- గచ్చిబౌలి- 9.6, సెం.మీ
- బహదూర్‌పురా -8.2 సెం.మీ
- చిలకలగూడ, ఆసిఫినగర్ -8.1 సెం.మీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)