Hyderabad News: హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన - భారీగా ట్రాఫిక్ జామ్, రాత్రికి మరింత తీవ్రం!
Hyderabad Rains: హైదరాబాద్ లో రాత్రిలోపు నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు.
Telangana News: హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షం ధాటికి ఎప్పటిలాగే రోడ్లపై నీరు నిలుస్తోంది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం.. మధ్యాహ్నానికి మారిపోయి అధిక వర్షం పడింది. నిమిషాల వ్యవధిలోనే దట్టమైన మబ్బులు కమ్ముకొని చాలా ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. సికింద్రాబాద్ బేగంపేట్, ప్రకాష్ నగర్, బోయిన్ పల్లి, మారేడ్ పల్లి, అడ్డగుట్ట, మెట్టుగూడ, చిలకలగూడ, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బంజరాహిల్స్, మాదాపూర్, క్రిష్ణానగర్ - యూసఫ్ గూడ, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం బాగా పడింది. కుత్బుల్లాపూర్, సూరారం, గాజులరామారం, చింతల్, అబిడ్స్, కోఠి, బహదూర్ పల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, నాంపల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆకాశం మేఘావృతం అయి కనిపించింది. కూకట్ పల్లి, నిజాంపేట్, మియాపూర్ ప్రాంతాల్లో చిరు చినుకులు పడ్డాయి.
రాబోయే రెండు మూడు గంటల్లో కుండపోత
రానున్న రెండు మూడు గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు.
భారీ వర్షం కారణంగా వాహనాల కదలికకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సోమవారం రాత్రికి ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రం అవుతుందని అంటున్నారు. అందుకే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆఫీసుల నుంచి ఒకే సమయంలో అందరూ బయటకు రావొద్దని, వేర్వేరు సమయాల్లో రోడ్డు పైకి రావాలని కోరుతున్నారు.