Hyderabad 144 Section: హైదరాబాద్‌లో మళ్లీ రజాకార్ల రాజ్యమంటూ హరీష్ రావు ఫైర్, 144 సెక్షన్‌పై సీవీ ఆనంద్ క్లారిటీ
144 section In Hyderabad | హైదరాబాద్, సికింద్రాబాద్ లలో అక్టోబర్ 27 నుంచి నెల రోజులపాటు ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని హైదరాబాద్ పోలీసుల ఉత్తర్వులు దుమారం రేపుతున్నాయి.
హైదరాబాద్: ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అటు నిరుద్యోగులతో పాటు ఇటు ఉద్యోగులను సైతం డీఏలు ఇవ్వకుండా మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్ లో పండుగలు, పెండ్లిళ్ల సీజన్ లో 144 సెక్షన్ పెట్టడం ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఐదుగురి కంటే ఎక్కువ జమ కావొద్దా..? ఇవన్నీ చూస్తుంటే నగరంలో మళ్లీ రజాకార్ల రాజ్యం వచ్చినట్లు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాలన ఎలా ఉందంటే.. ఎవరూ పెండ్లి చేసుకోవద్దు, బట్టలు కొనుక్కొవద్దు, పండుగలు కూడా చేసుకోవద్దు అనేలా ఉందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికీ మేలు జరగడం లేదని, కనీసం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను సైతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగించడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. దసరాకు బతుకమ్మ చీరలు ఇవ్వలేదని, రైతులకు రూ.15 వేలు ఇవ్వకుండా మొండిచేయి చూపింది. రాష్ట్రంలో వడ్లు కొనే దిక్కులేదు, మద్దతు ధర ప్రకటించడం లేదన్నారు. రూ.2,320 మద్దతు ధర రావాల్సిన వడ్లను రూ. 1900 కే రైతులు అమ్ముకుంటున్నారని హరీష్ రావు తెలిపారు. రూ.7500 మేర మద్దతు ధర రాకోవడంతో రూ.5500 కే విక్రయించి పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ క్లారిటీ
హైదరాబాద్ పోలీసులు మూక సమూహాలు, ధర్నాలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ పై ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ లో నెల రోజులపాటు 144 సెక్షన్ విధించారన్న విమర్శలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. తాము జారీ చేసిన నోటిఫికేషన్ కు దీపావళి పండుగ వేడుకలకు ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్ సీపీ స్పష్టం చేశారు.
ఈ సమయంలో తెలంగాణ సచివాలయం, సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం, రాజ్‌భవన్ లాంటి ముఖ్యమైన వాటిపై ఆకస్మిక దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడటంలో భాగంగా పోలీసులు చర్యలు తీసుకునేందుకు వీలు కలిగేలా నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఇలాంటి సమాచారం ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా అవసరాన్ని బట్టి పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకోవడం సర్వసాధారణం. అయితే కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా ఇది కర్ఫ్యూ కాదు. మీరు రిలాక్స్ అవ్వాలంటూ సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.
CP, Hyd city has issued Notification regarding the Prohibition of every kind of gathering of 5 or more persons, processions, dharnas, rallies public meeting in the limits of Hyderabad and Secunderabad. pic.twitter.com/onijgYgJ6w
— Hyderabad City Police (@hydcitypolice) October 27, 2024
అక్టోబర్ 27 నుంచి నెల రోజుల పాటు ఆంక్షలు
బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద అక్టోబర్ 27 నుంచి నవంబర్ 28 వరకు నెల రోజుల పాటు ప్రజలకు అంతరాయం కలిగించే చర్యలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో ర్యాలీలు నిర్వహించడం, 5 లేక అంతమంది కంటే ఎక్కువగా గుమిగూడటంపై నిషేధం అమలులో ఉంటుంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వదద శాంతియుతంగా చేపట్టనున్న ధర్నాలు, ర్యాలీలు, నిరసనలకు మాత్రం అనుమతి ఉంటుంది. ఈ నెల రోజుల సమయంలో హైదరాబాద్ లో ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదని.. ఎవరైనా ర్యాలీలు, సభలు, సమావేశాలు పర్మిషన్ లేకుండా నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులలో హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.